Chanakya Tips : ఉద్యోగాలు చేసేవారు ఎవరైనా సరే.. చాలా సందర్భాల్లో ఆఫీసుల్లో జరిగే రాజకీయాలకు బలవుతుంటారు. తోటి ఉద్యోగులు చేసే కుటిల ప్రయత్నాలకు ఉద్యోగాలను కోల్పోయే స్థితికి చేరుకుంటారు. కొందరు తాము తమ కెరీర్‌లో ఎదగడం కోసం తోటి ఉద్యోగులను తొక్కేసేందుకు యత్నిస్తారు. అయితే అలాంటి వారిని ముందుగానే పసిగట్టడంతోపాటు ఆఫీసు రాజకీయాల్లో బలవకుండా అందరిపై పైచేయి సాధించాలంటే.. అందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. మరి ఆ సూత్రాలు ఏమిటంటే..
1. ఆఫీసు రాజకీయాల్లో పైచేయి సాధించాలంటే ముఖ్యంగా పాటించాల్సింది.. మన బలహీనతల గురించి ఎవరికీ చెప్పకపోవడం. మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో తెలిస్తే.. తోటి ఉద్యోగులు వాటిని అదునుగా చేసుకుని మనల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తారు. కనుక మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఎదుటి వారికి అస్సలు చెప్పరాదు. కానీ మనకు ఉన్న బలాన్ని మాత్రం ఆఫీసులో అందరి ఎదుట చూపించుకోవచ్చు. అందుకు గాను పై అధికారులు చెప్పిన పనులను చేయాలి. మన టాలెంట్ ఏమిటో సత్తా చాటాలి. దీంతో తోటి ఉద్యోగులకు మన బలం ఏమిటో తెలుస్తుంది. దాంతో మన జోలికి రాకుండా ఉంటారు.
2. ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరు ఎటువంటి వారో ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే కొందరు మన దగ్గర ఒకలా.. వేరే వారి దగ్గర ఇంకొకలా మాట్లాడతారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారు మన గురించి పై అధికారులకు తప్పుగా చెప్పే ప్రమాదం ఉంటుంది. కనుక ఆఫీసులో ఎవరు ఎటువంటి వారో కచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తుల గుణాలకు అనుగుణంగా వారి వద్ద ప్రవర్తించాలి. దీంతో ఆఫీసు రాజకీయాల్లో పై చేయి సాధించగలుగుతారు.
3. ఆఫీసులో ఎలాంటి పని ఉన్నా సరే నిజాయితీగా చేయాలి. మన గురించి పక్క వారు మాట్లాడుకోవాలంటే మన నిజాయితీని వారికి తెలిసేలా పనిచేయాలి. ఇది మనకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. దీంతో ఎవరైనా మనపై రాజకీయాలు చేయదలచినా మనకు ఉండే నిజాయితీ అనే పేరు మనల్ని కాపాడుతుంది. మన ఉద్యోగం పోకుండా చూస్తుంది.
4. ఆఫీసు రాజకీయాల్లో పై చేయి సాధించాలంటే.. తోటి ఉద్యోగుల కన్నా స్కిల్స్ ను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. ఉద్యోగులతో మనల్ని మనం పోల్చుకుని మన స్కిల్ వారి కన్నా మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పనిలోనూ సత్తా చాటాలి. ఇలా చేస్తే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. మనపై రాజకీయం చేయలేరు.
5. ఆఫీస్‌లో ఉత్తమ ఉద్యోగిగా పేరు తెచ్చుకోవాలంటే సమయవేళలను కచ్చితంగా పాటించాలి. టైముకు ఆఫీస్‌కు రావడంతోపాటు సమయం వృథా చేయకుండా పనిచేయాలి. టైమ్ పంక్చువల్‌గా ఉండడం కూడా మనకు పేరు తెచ్చి పెడుతుంది. దీంతో ఆఫీస్‌లో మనపై ఎలాంటి రాజకీయాలు చేయలేరు.
6. ఆఫీస్ లో మనకు కొందరు మంచి సలహాలు ఇస్తుంటారు. వాటిని పాటించాలి. కొందరు చెడగొట్టే సలహాలు ఇస్తారు. అలాంటి వారిని పట్టించుకోవద్దు. అలాగే మూర్ఖులతో వాదించకూడదు. మనకు ఉన్న సీక్రెట్స్ ఎదుటి వారికి అస్సలు చెప్పరాదు. ఎప్పటికీ భయపడకూడదు. ఆందోళన చెందకూడదు. అనవసరంగా కోపం, ఆవేశం తెచ్చుకోకూడదు. ఇవి మనకు హాని చేస్తాయి. వాటిని అవసరం ఉన్న చోటే వాడాలి.
ఈ విధంగా చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే.. ఆఫీస్ రాజకీయాల్లో ఎవరైనా సరే బలి కాకుండా ఉంటారు. అలాగే కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.