Grapes : మనకు అందుబాటులో ఉండే అత్యంత చవకైన పండ్లలో ద్రాక్షలు ఒకటి. ఇవి మనకు మూడు రంగుల్లో లభిస్తున్నాయి. ఆకుపచ్చతోపాటు ఎరుపు, నలుపు రంగుల్లోనూ మనకు ద్రాక్షలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది ద్రాక్షలను ఇష్టంగా తింటుంటారు. ద్రాక్షలతో జ్యూస్ తయారు చేసుకుని కూడా తాగుతుంటారు. అయితే ద్రాక్షలను తినడం వల్ల నిద్ర వస్తుందా ? వీటిని తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రాక్షల్లో మన శరీరానికి అవసరం అయిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ద్రాక్షలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే ద్రాక్షలను తినడం వల్ల నిద్ర చక్కగా పడుతుందని.. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్షలలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది సహజసిద్ధంగా వాటిలో లభిస్తుంది. ఇది మన నిద్రను నియంత్రించే హార్మోన్. కనుక ద్రాక్షలను తింటే సహజంగానే నిద్ర వస్తుంది. కనుకనే ద్రాక్షలతో తయారు చేసే వైన్‌ను రాత్రి పూట 30 ఎంఎల్ మోతాదులో తాగితే నిద్ర పోవచ్చని చెబుతుంటారు. ఇక నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు రాత్రి భోజనం అనంతరం ఒక కప్పు ద్రాక్ష పండ్లను తినాలి. దీంతో నిద్ర బాగా వస్తుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే ఆకుపచ్చ కాకుండా నలుపు, ఎరుపు రంగులో ఉండే ద్రాక్షలను తింటేనే ఇలా ప్రయోజనాన్నిపొందవచ్చు.