Masala Jowar Roti : చిరు ధాన్యాల్లో జొన్నలు ఒకటి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. జొన్న గటక లేదా జొన్న రొట్టెను చాలా మంది తయారు చేసుకుని తింటుంటారు. జొన్నలను అన్నంగా కూడా వండుకుని తింటుంటారు. అయితే జొన్నలతో చేసే సాధారణ రొట్టెలు కొంత మందికి నచ్చవు. కనుక వాటిలో కొన్ని ఇతర పదార్థాలను కలిపి తయారు చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. జొన్న రొట్టెలను భిన్నమైన రూపంలో ఎలా తయారు చేసుకోవాలి.. అందుకు ఏమేం పదార్థాలు కావాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా జొన్న రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్న పిండి – 3 కప్పులు, పచ్చి పల్లీలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీస్పూన్, నువ్వులు – ఒక టీస్పూన్, కొత్తిమీర – చిన్న కట్ట, కరివేపాకులు – రెండు రెబ్బలు, నూనె – తగినంత.
మసాలా జొన్న రొట్టెను తయారు చేసే విధానం..
ముందుగా తగినన్ని నీళ్లు తీసుకుని ఉప్పు వేసి మరిగించుకోవాలి. మిక్సీలో పచ్చి మిర్చిని పేస్ట్ చేసుకోవాలి. పల్లీలను కొద్దిగా వేయించి పొట్టు తీయాలి. అనంతరం వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాత్రలో జొన్న పిండి, పల్లీల పొడి, జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర తురుము, కరివేపాకు, పచ్చి మిర్చి పేస్ట్ వేసుకుని.. వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. కాస్త మందంగా రొట్టెల్లా చేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జొన్న రొట్టె ఎంతో రుచిగా ఉంటుంది. ఒక రొట్టెను తినేవారు ఎంచక్కా రెండు రొట్టెలను లాగించేస్తారు. దీంతో జొన్నల ద్వారా కలిగే ప్రయోజనాలన్నీ ఈ రొట్టె ద్వారా మనకు లభిస్తాయి. అలాగే జీలకర్ర, పల్లీలను కూడా వేస్తారు కనుక ఈ రొట్టె మనకు శక్తిని, పొషణను అందిస్తుంది. అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి, అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ రొట్టె ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని రోజూ తినవచ్చు.