Masala Palli Chat : మనం వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలలో పల్లీలు (వేరు శనగ పప్పులు) ఒకటి. వీటిని మనం అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయడంలో వాడుతూ ఉంటాం. పల్లీలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు, శరీర సౌష్ఠవం పెంచుకోవడానికి పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి.
పల్లీలను తినడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. గుండె జబ్బుల బారిన పడకుండా చేయడంలో పల్లీలు సహాయపడతాయి. మనం పల్లీలను వేయించి, ఉడికించి, పచ్చివి కూడా తింటూ ఉంటాం. వీటిని ఎక్కువగా తాళింపుల్లో, చట్నీలలో, పచ్చళ్లలో, తీపి పదార్థాల తయారీలో వాడుతూ ఉంటాం. పల్లీలతో ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లి చాట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా పల్లి చాట్ తయారీ విధానాన్ని, తయారీకి కావల్సిన పదార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పల్లి చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 100 గ్రా., తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, తరిగిన టమాటా ముక్కలు – అర కప్పు, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నిమ్మ కాయ రసం – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – 2 గ్లాసులు.
మసాలా పల్లి చాట్ తయారీ విధానం..
ముందుగా పల్లీలను రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నానబెట్టుకున్న పల్లీలను, రెండు గ్లాసుల నీళ్లను పోసి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పల్లీలు మెత్తగా ఉడికిన తరువాత నీటిని పారబోసి పల్లీలను చల్లారనివ్వాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే మసాలా పల్లి చాట్ తయారవుతుంది. సాయంత్రం వేళల్లో శరీరానికి హాని కలిగించే స్నాక్స్ ను తినడానికి బదులుగా ఇలా మసాలా పల్లి చాట్ ను తయారు చేసుకొని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.