Papaya : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. దీనిని సంస్కృతంలో మదుకర్కటి అని, ఇంగ్లీష్ లో పపయా అని పిలుస్తారు. దీనిని కొన్ని ప్రాంతాలలో బొప్పాయి మదునాబ అని కూడా పిలుస్తారు. దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఇతర పండ్ల లాగా బొప్పాయి పండ్లు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. అంతే కాకుండా బొప్పాయి పండ్లతోపాటు ఆకులు, పువ్వులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కలిగి ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు.
మనకు బొప్పాయి పండ్లు సంవత్సరం పొడువునా లభిస్తూనే ఉంటాయి. బొప్పాయి పండ్లల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి లతోపాటు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థాలు జీర్ణ క్రియ సాఫీగా సాగేలా జరగడంలో సహాయపడతాయి. ఉదర సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ బొప్పాయి పండ్లు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో పోషకాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గడంలో కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి.
రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచే శక్తి బొప్పాయి చెట్టు ఆకులకు ఉందని పరిశోధనలల్లో రుజువైంది. బొప్పాయి చెట్టు ఆకుల రసాన్ని రెండు టీ స్పూన్ల చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయి పండును తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. స్త్రీలలో నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలోనూ బొప్పాయి పండు ఉపయోగపడుతుంది.
బొప్పాయి పండు గుజ్జులో తేనెను కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ పండ్లను తరచూ తింటూ ఉండడం వల్ల చర్మంపై ఉండే ముడతలు తొలగిపోతాయి. వయస్సు తక్కువగా, యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. అలసటను, మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ ఈ పండు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కనుక ఇతర పండ్ల లాగా బొప్పాయి పండును కూడా తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని, ఈ పండును తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.