Green Gram : పెసలు.. ఇవి మనందరికీ తెలుసు. ఇవి నవధాన్యాలలో ఒకటి. పెసలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పెసర దోశలు. వీటితో పులగాన్ని, గుగ్గిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. మనకు నలుపు, ఆకు పచ్చ రంగులో ఉండే పెసలు లభిస్తాయి. మనం ఎక్కువగా ఆకు పచ్చ రంగులో ఉండే పెసలను ఉపయోగిస్తాం. మొలకెత్తిన పెసలను కూడా చాలా మంది తింటూ ఉంటారు. మొలకెత్తిన పెసలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పెసలు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. నానబెట్టిన పెసర పప్పుకు మనం బెల్లాన్ని కలిపి ప్రసాదంగా కూడా తీసుకుంటాం. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని వీటిని అధికంగా తినకూడదు.
పెసలను అమితంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. పెసల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువుతో బాధపడే వారు ప్రతిరోజూ బియ్యంలో పెసలను కలిపి పులగంలా వండుకుని తింటే ఊహించని రీతిలో బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బీపీని నియంత్రించడంలో కూడా పెసలు ఉపయోగపడతాయి. పూర్వకాలంలో చర్మ సంరక్షణకు పెసర పిండిని ఉపయోగించేవారు. పిల్లలకు, పెద్దలకు కూడా పెసర పిండిని నలుగు పిండిలా ఉపయోగించేవారు. సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో పెసర పిండి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని నలుగు పిండిలా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచడంలో కూడా పెసలు మనకు ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు పెసలను, మెంతులను కలిపి నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా రుబ్బి జుట్టుకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా పెసలు జుట్టుకు కండిషనర్ గా, షాంపుగా కూడా పని చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా ఉంటాం. జీర్ణ శక్తి మెరుగుపరిచి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా పెసలు ఉపయోగపడతాయి. ఈ విధంగా పెసలను ఉపయోగించి మనం పలు రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని, వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు.