Over Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళకు భోజనం చేయాలి. వ్యాయామం కూడా చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. వీటితోపాటు రోజూ తగినన్ని గంటల పాటు నిద్రించాలి. కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అయినా మనకు కావాలి. అయితే కొందరు తగినన్ని గంటల పాటు నిద్రించరు. అలాగే కొందరు అవసరానికి మించి అతిగా నిద్రపోతుంటారు. ఈ క్రమంలోనే అతి నిద్ర అనేది అనర్థదాయకమని.. దీంతో అనేక దుష్పరిణామాలు కలుగుతాయని.. ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఇక అతి నిద్ర వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అతిగా నిద్రించడం వల్ల శరీరం బద్దకంగా తయారవుతుంది. యాక్టివ్‌గా ఉండరు. ఏ పని చేయాలన్నా బద్దకంగా అనిపిస్తుంది. మెదడు మొద్దుబారిపోతుంది. స్వతహాగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతుంది. అలాగే అధికంగా బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి స్థూలకాయం వస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది.
అతిగా నిద్రిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే అధ్యయనాల ప్రకారం.. అతిగా నిద్రించే వారు డిప్రెషన్ బారిన పడతారని చెబుతున్నారు. దీంతోపాటు తలనొప్పి కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతోపాటు ఏదైనా వ్యాధితో చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. కనుక అతి నిద్ర అన్నది ఆరోగ్యానికి హానికరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అతిగా నిద్రిస్తే అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. కాబట్టి రోజుకు తగినన్ని గంటల పాటు మాత్రమే నిద్రించాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.