Eye Sight : సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు చెబుతుంటారు. కంటి చూపు చక్కగా ఉంటేనే మనం దేనినైనా సరిగ్గా చూడగలం. పూర్వం మన పెద్దలు కళ్లజోడు లేకుండానే చక్కగా చూసేవారు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయస్సు నుండే కళ్లజోడును ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. పోషకాహార లోపంతోపాటు కంప్యూటర్, సెల్ ఫోన్ ల వాడకం ఎక్కువవడం వంటి కారణాల వల్ల కంటి చూపు మందగిస్తోంది. కళ్ల జోడును ఉపయోగించే అవసరం లేకుండానే కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి మనం కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. కంటి చూపును మెరుగుపరిచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేసి రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేస్తుంది. తరచూ ఉసిరికాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే క్యారెట్ లో విటమిన్ ఎ తోపాటు కంటి చూపును మెరుగుపరిచే బీటాకెరోటిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కంటి చూపు మందగించిన వారు ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి మనం సోంపు గింజలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఆహారం జీర్ణమయ్యేలా చేయడంతోపాటు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. కంటి చూపును మెరుగుపరిచే అనేక రకాల పోషకాలు సోంపు గింజల్లో ఉంటాయి.
దృష్టి సంబంధిత సమస్యలతో బాధపడే వారు బాదం పప్పును, పటిక బెల్లాన్ని, సోంపు గింజలను సమపాళ్లలో తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ పడుకునే ముందు పాలలో కలిపి తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడి దృష్టి లోపాలు తొలగిపోతాయి. అలాగే వారానికి కనీసం రెండు సార్లు ఏదో ఒక ఆకుకూరను ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడంతోపాటు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
సెల్ ఫోన్ లను, కంప్యూటర్ లను వాడే వారు తదేకంగా వాటినే చూడకూడదు. కళ్లను అటూ ఇటూ తిప్పుతూ వ్యాయామం చేయాలి. అలాగే 30 సెకన్ల పాటు కనురెప్పలను మూస్తూ తెరుస్తూ ఉండాలి. కళ్లకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. టీవిని చూసేటప్పుడు తగిన దూరం పాటించాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల క్రమంగా కంటి చూపు మెరుగుపడి దృష్టి లోపాలు తొలగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు.