Fruits : రోజూ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో మనందరికి తెలిసిందే. పండ్లను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అన్నీ లభిస్తాయి. పండ్లను సాధారణంగా మనం తొక్క వలిచి తింటూ ఉంటాం. కానీ కొన్ని రకాల పండ్లను మాత్రం తొక్క తీయకుండానే తినాలి. అలా తొక్క తీయకుండా తింటేనే ఆ పండ్ల వల్ల మనకు పూర్తి స్థాయి లాభాలు కలుగుతాయి. అలాగని అరటి పండు, కమలాపండు వాటిని తినమని కాదు. ప్రత్యేకించి కొన్ని పండ్లను మాత్రం తొక్క తీయకుండానే తినాలి. తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ ను తొక్క తీయకుండా తింటేనే చాలా మంచిది. చాలా మంది తొక్క తీయకుండానే తింటారు. కానీ కొందరూ మాత్రం తొక్క తీసి తింటారు. రోజుకు ఒక ఆపిల్ ను తొక్క తీయకుండా తినడం వల్ల రక్తపోటును తగ్గించుకోవచ్చు. రక్తపోటును తగ్గించే ఔషధ గుణాలు ఆపిల్ తొక్కలో ఆరు రెట్లు అధికంగా ఉన్నాయి. కాలంతో సంబంధం లేకుండా దొరికే పండు కనుక రోజుకో ఆపిల్ తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆపిల్ ను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే తొక్క తీయకుండా తినాల్సిన పండ్లల్లో పియర్స్ కూడా ఒకటి. ఈ పండ్లను కూడా మనం తొక్క తీయకుండానే తినాలి. దీని వల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరానికి అందుతాయి. అంతేకాకుండా పియర్స్ పండ్ల తొక్కలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పియర్స్ పండు తొక్కలో ఉండే ఈ గుణాలు శరీరంలో వాపులను, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి.
సపోటా పండ్లు మనందరికి తెలిసినవే. చాలా మంది సపోటా పండ్లను తొక్క తీసేసి తింటారు. అలాకాకుండా సపోటా పండ్లను తొక్కతోనే నేరుగా తినాలి. దీని వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. అంతేకాకుండా పొటాషియం, ఐరన్, ఫోలోట్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు శరీరానికి అందుతాయి. ప్లమ్ ఫ్రూట్స్ పండ్లను తొక్క తీయకుండా తింటే ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు ఒత్తిడిని, ఆందోళనను దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. జీర్ణసంంధిత సమస్యలు వెంటనే మాయమవుతాయి. అదే విధంగా కివీ పండ్లను కూడా మనం తొక్క తీయకుండానే తినాలి. ఈ పండ్లను చాలా మంది తొక్క తీసి తింటారు. కానీ అలా చేయకూడదు. కివీ పండ్ల తొక్కలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా రెట్టింపు అవుతుంది. ఈ పండ్లను తొక్కతో తినడం వల్ల శరీరంలో ఉండే ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి.
మామిడి పండ్లు.. వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు. ఈ మామిడి పండ్లను కూడా తొక్కతో అలాగే తినాలి. చాలా మంది చక్కగా తొక్కను తీసేసి తింటారు. మామిడి పండ్లను తొక్కతో తినడం వల్ల వాటిలో ఉండే కెరొటినాయిడ్లు, ఫాలీ ఫినాల్స్, ఒమెగా 3, ఒమెగా6 యాసిడ్లు మన శరీరానికి అందుతాయి. వీటి వల్ల క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు దూరమవుతాయి. ఇవే కాకుండా తొక్కతో తినగలిగిన పండ్లంన్నింటిని తొక్కతోనే తినాలి. అలా తింటేనే మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.