Gongura Karam Podi : గోంగూర అంటే సహజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది పచ్చడి లేదా పప్పు రూపంలో తింటుంటారు. పుల్లగా ఉండే గోంగూరతో వీటిని చేస్తే.. రుచి మామూలుగా ఉండదు. అయితే గోంగూరతో మనం కారంపొడిని కూడా తయారు చేయవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంతో తింటే ఆ రుచిని ఆస్వాదిస్తారు. ఇక గోంగూర కారప్పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర కారంపొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర ఆకులు – 4 కప్పులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు – పావు కప్పు చొప్పున, వెల్లుల్లి – 4, ఎండు మిర్చి – 12, మినప పప్పు – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, శనగపప్పు – అర కప్పు, మెంతులు – ఒక టీస్పూన్, నూనె – రెండు టీస్పూన్లు.
గోంగూర కారంపొడిని తయారు చేసే విధానం..
బాణలిలో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి వేయించి తీయాలి. తరువాత అందులోనే శనగపప్పు, మినప పప్పు, వెల్లుల్లి, ఎండు మిర్చి కూడా వేసి వేయించి తీయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి గోంగూర ఆకులు వేసి సిమ్‌లో వేయించాలి. తరువాత మిక్సీలో ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి ఓసారి తిప్పాలి. ఆ తరువాత శనగపప్పు, మినప పప్పు, వెల్లుల్లి, ఉప్పు, ఎండు మిర్చి వేసి కచ్చా పచ్చాగా తిప్పాలి. చివరిగా వేయించిన గోంగూర ఆకులను కూడా వేసి ఓసారి తిప్పి తీస్తే చాలు. రుచికరమైన గోంగూర కారం పొడి తయారవుతుంది. దీన్ని అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచి అదిరిపోతుంది.