ప్రస్తుత తరుణంలో చాలా మందికి దంత సమస్యలు వస్తున్నాయి. దంతాలు జివ్వుమని లాగడం, దంతాలు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన.. వంటి అనేక సమస్యలతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే పూర్వం మన పెద్దలు ఇప్పటిలా టూత్‌పేస్టులను వాడలేదు. అయినప్పటికీ వారి దంతాలు దృఢంగా ఉండేవి. అయితే వారి దంతాలు అలా దృఢంగా ఉండేందుకు సీక్రెట్ ఏమిటో తెలుసా..? వేప పుల్లలు. అవును.. అవే.. వాటితోనే మన పెద్దలు దంతాలను తోముకునే వారు. కనుకనే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేవి. వారి దంతాలు దృఢంగా ఉండేవి.
వేప పుల్లల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటితో నిత్యం దంతాలను తోముకోవాలి. దీని వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
1. చాలా మందికి నోరు దుర్వాసన వస్తుంటుంది. అలాంటి సమస్య ఉన్నవారు రోజూ వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. 5 నుంచి 15 నిమిషాల పాటు దంతాలను వేప పుల్లతో బాగా తోమాలి. తరువాత ఆ పుల్లను బాగా నమిలి అందులో నుంచి వచ్చే రసాన్ని నోట్లోనే ఉంచుకుని పుక్కిలించాలి. ఇలా 2 నుంచి 5 నిమిషాల పాటు చేయాలి. తరువాత నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే నోటి దుర్వాసన సమస్యే ఉండదు. నోట్లు బాక్టీరియా పెరగకుండా ఉంటుంది. నోరు తాజాగా ఉంటుంది.
2. దంతాలు, చిగుళ్ల నుంచి రక్తం కారేవారు, ఆయా భాగాలు వాపులకు లోనై నొప్పుల సమస్యలను ఎదుర్కొంటున్నవారు రోజూ దంతాలను వేప పుల్లలతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా నొప్పి ఉన్న భాగాల్లో, రక్తం కారే చోట్ల కొంచెం ఎక్కువ సేపు శుభ్రం చేయాలి. దీంతో వేప పుల్లల్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు నోట్లోని బాక్టీరియాను నాశనం చేస్తాయి. అలాగే దంతాలు, చిగుళ్ల వాపులు తగ్గడంతోపాటు ఆయా భాగాల నుంచి రక్తం కారకుండా ఉంటుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
3. దంతాలు, చిగుళ్ల సమస్య కారణంగా కొందరికి Pyorrhea అనే సమస్య వస్తుంది. ఇది వచ్చిందంటే చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్ అవుతుంది. దీంతో దవడ ఎముక దెబ్బ తింటుంది. అయితే చిగుళ్ల సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు నిర్లక్ష్యం చేయకూడదు. రోజూ వేప పుల్లతో 15 నిమిషాల పాటు దంతాలను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ఈ సమస్య నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది.
4. వేప పుల్లల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల నోరు, దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. రోజూ వేప పుల్లతో దంతాలు, చిగుళ్లు, నోటిని శుభ్రం చేసుకుంటే కొద్ది రోజులకు సమస్యలు తగ్గుతాయి. అదే కొనసాగిస్తే ఆయా భాగాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి.