గర్భం దాల్చిన మహిళలకు సహజంగానే మార్నింగ్ సిక్‌నెస్ సమస్య వస్తుంటుంది. గర్భిణీల్లో 75 నుంచి 80 శాతం మంది వికారం, అలసట, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. గర్భం దాల్చిన ఆరవ వారంలో మహిళలకు ఈ సమస్యలు వస్తుంటాయి. 8వ వారంలో ఆయా సమస్యలు తగ్గుతాయి. అయితే ఈ సమస్యలు సహజమే అయినప్పటికీ కొందరు వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
1. వికారం సమస్యకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్లం రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో రోజుకు 3 సార్లు సేవించాలి. లేదా అల్లంతో తయారు చేసిన డికాషన్ తాగవచ్చు. దీంతో వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం తగ్గుతాయి.
2. పుదీనా మనకు తాజాదనాన్ని, శరీరానికి చల్ల దనాన్ని అందిస్తుంది. వికారం తగ్గేందుకు సహాయపడుతుంది. పుదీనా ఆకులు కొన్నింటిని తీసుకుని వాటిని నేరుగా నమిలి మింగాలి. లేదా ఆ ఆకులను వాసన కూడా చూడవచ్చు. వికారం తగ్గుతుంది.
3. ఒక పాత్రలో నీటిని తీసుకుని మరిగించి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రోజుకు రెండు సార్లు ఇలా తాగితే మార్నింగ్ సిక్‌నెస్ సమస్య తగ్గుతుంది. అవసరం అనుకుంటే అందుల కొద్దిగా ఉప్పు, చక్కెర కలుపుకుని తాగవచ్చు.
4. ఒక కప్పు పాలలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి మరిగించాలి. అనంతరం ఆ పాలలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి రోజూ నిద్రించే ముందు తాగాలి. ఆయుర్వేద ప్రకారం రోజ్ వాటర్, పాలు వికారం సమస్యను తగ్గించేందుకు బాగా పనిచేస్తాయి.
5. ఒక గ్లాస్ కొబ్బరినీళ్లలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. కొబ్బరినీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మలబద్దకం సమస్యను తగ్గిస్తాయి. గర్భిణీలకు వచ్చే సమస్యల నుంచి బయట పడేస్తాయి.
6. సోంపు గింజలు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి పదార్థాలను రోజూ తీసుకుంటే వికారం సమస్య తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365