Leg Cramps : మనలో చాలా మందికి రాత్రి నిద్రించేటప్పుడు పిక్కలు పట్టుకుపోయి విపరీతమైన నొప్పి, బాధను కలిగిస్తూ ఉంటాయి. ఇలా పిక్కల్లో కండరాలు పట్టుకుపోవడం వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. అనుభవించిన వారికే ఆ బాధ తెలుస్తుంది. ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు ఈ సమస్య బారిన పడాల్సిందే. ఇలా పిక్కలు పట్టుకుపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాళ్లకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోయినా అలాగే వెన్నుపూస దగ్గర నరాలపై ఒత్తిడి ఎక్కువగా కలిగినా కూడా ఇలా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అలవాటు లేని వ్యాయామాలు చేసినా కూడా ఇలా జరుగుతుంది. అదే విధంగా శరీరంలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి లవనాలు తగ్గినప్పుడు కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే ధూమపానం అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
అలాగే డీహైడ్రేషన్ కు గురి అయినప్పుడు కూడా ఇలా పిక్కల్లో కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఇలా పిక్కల్లో కండరాలు పట్టేసినప్పుడు నొప్పి తగ్గడానికి చాలా సమయం పడుతుంది. నొప్పి తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. వీలైతే వేడి నీటితో స్నానం చేయాలి. అలాగే ఇలా పిక్కలు పట్టేసినప్పుడు కాలును కొద్దిగా పైకి ఎత్తి పాదాన్ని కిందికి పైకి కదిలించడం వల్ల కూడా కొద్దిగా ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నోట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల కూడా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ బొప్పాయి, చిలగడ దుంప, పుచ్చకాయ, ఖర్బూజ, గుమ్మడికాయ, అరటి పండు వంటి వాటిని తీసుకోవాలి. అదే విధంగా శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
చక్కటి ఆహారాన్ని తీసుకున్నప్పటికి సమస్య పదే పదే వేధిస్తూ ఉంటే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. పిక్కలు పట్టేయడం అనేది సాధారణ సమస్యే అయినా అందరిలో వచ్చే సమస్యే అయినా దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. తరచూ పిక్కలు పట్టేయడం అలాగే కండరాలు చాలా సేపటి వరకు సాధారణ స్థితికి రాకపోవడం, అలాగే పిక్కలు పట్టేసి కాళు బలహీనంగా అయ్యి నడవలేని స్థితి రావడం వంటి వాటిని గుర్తిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు.