Challa Idli : ఇడ్లీలు.. మనం అల్సాహారంగా తీసుకునే ఆహార పదార్థాల్లో ఇవి కూడా ఒకటి. ఇడ్లీలను మనం తరచూ ఇంట్లో తయారు చేస్తూ ఉంటాము. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మనం సాధారణంగా ఇడ్లీలను చట్నీ, సాంబార్ తో తింటూ ఉంటాము. ఇవే కాకుండా ఈ ఇడ్లీలను మనం మజ్జిగతో కూడా తినవచ్చు. మజ్జిగ చారు, ఇడ్లీలను కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వేసవికాలంలో ఇలా ఇడ్లీలను మజ్జిగ చారుతో తింటే వేడి చేయకుండా ఉంటుంది. ఇడ్లీలను తినడానికి మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చల్ల ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిలికిన పెరుగు – ఒక కప్పు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 3, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చల్ల ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చిలికిన పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. మజ్జిగ పలుచగా ఉండేలా చూసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, అల్లం తరుగు వేసి కలపాలి. దీనిని మరో నిమిషంపాటు వేయించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మజ్జిగను వేసి కలపాలి.
దీనిని మధ్యస్థ మంటపై ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మజ్జిగ చారు తయారవుతుంది. ఇప్పుడు గిన్నెలో వేడి వేడి మెత్తని ఇడ్లీలను తీసుకోవాలి. తరువాత అవి మునిగే వరకు మనం తయారు చేసుకున్న మజ్జిగ చారును పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీలు మజ్జిగ చారు కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా తినడం వల్ల శరీరానికి కూడా చలువ చేస్తుంది.