Drumsticks Masala Curry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో మునక్కాయలు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను మునక్కాయలు కలిగి ఉన్నాయి. మునక్కాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మునక్కాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మునక్కాయ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా ఈ మునక్కాయ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునక్కాయ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 3, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మునక్కాయలు – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మునక్కాయ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు, ధనియాలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత కొబ్బరి పొడి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే చింతపండు తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మునక్కాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండు మిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత వేయించిన మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మునక్కాయ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా చేసిన మునక్కాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.