Chicken Liver Vepudu : మనం చికెన్ తో పాటుగా చికెన్ లివర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనిలో కూడా మన శరీరానికి అవపసరమయ్యే వివిధ పోషకాలు ఉంటాయి. ఈ చికెన్ లివర్ తో ఎక్కువగా వేపుడు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. చికెన్ లివర్ తో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ చికెన్ లివర్ వేపుడును తయారు చేయడం చాలా సులభం. కేవలం అరగంటలోనే రుచికరమైన చికెన్ లివర్ వేపుడును తయారు చేసుకోవచ్చు. రుచిగా, అందరికి నచ్చేలా ఈ చికెన్ లివర్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లివర్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ లివర్ – అర కిలో, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 7, జీలకర్ర -అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క, ఎండు కొబ్బరి ముక్క- ఒక ఇంచు ముక్క, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చికెన్ లివర్ వేపుడు తయారీ విధానం..
ముందుగా చికెన్ లివర్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత దీనిని శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియలు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కరివేపాకు వేసి కలపాలి. తరువాత చికెన్ లివర్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి.
ఇలా వేయించిన తరువాత పసుపు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు వేయించాలి. లివర్ ముక్కలు చక్కగా వేగిన తరువాత కారం, మిక్సీ పట్టుకున్న పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ లివర్ వేపుడు తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ లివర్ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.