Peanuts : మనకు అందుబాటులో ఉండే అతిబలమైన ఆహారాల్లో పల్లీలు కూడా ఒకటి. వీటిని మనం వంటల్లో, చట్నీల తయారీలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. చాలా మంది గుడ్లు, మాంసం మాత్రమే బలమైన ఆహారాలుగా భావిస్తారు. కానీ పల్లీలు వాటి కంటే బలమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. 100 గ్రా. పల్లీలల్లో 567 క్యాలరీల శక్తి, 25 గ్రాముల ప్రోటీన్, 45 గ్రాముల ఫ్యాట్, పొటాషియం 705 మిల్లీ గ్రాములు, ఫైబర్ 9 గ్రాములు, ఐరన్ 25 శాతం, విటమిన్ బి 6 15 శాతం, మెగ్నీషియం 42 శాతం, క్యాల్షియం 9 శాతం ఉంటుంది.
పల్లీలల్లో నూనె వాతం ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని నేరుగా మనం ఎక్కువగా తీసుకోలేము. పచ్చి పల్లీలను తినడం వల్ల వెగటగా, నాలుకకు చుట్టుకుపోయినట్టుగా ఉంటుంది. కనుయ ఈ పల్లీలను ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికించి తీసుకోవాలి. అలాగే వీటిని నానబెట్టి లేదా మొలకెత్తించి కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల పల్లీలను మనం ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు. అలాగే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. గర్భిణీ స్త్రీలు, కండ పట్టి బరువు పెరగాలనుకునే వారు, బాలింతలు, ఆటలు ఆడే వారు, ఎదిగే పిల్లలు, వ్యాయామం చేసే వారు ఇలా పల్లీలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు పోషకాలు కూడా లభిస్తాయి. పల్లీలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
ఎముకలు ధృడంగా తయారవుతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. చర్మం, మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాంసం , జీడిపప్పు, బాదంపప్పు కంటే కూడా ఈ పల్లీలు మనకు తక్కువ ధరలో లభిస్తాయి. వీటిని కొనుగోలు చేసి తీసుకోలేని వారు ఇలా పల్లీలను తీసుకోవడం వల్ల మాంసం కంటే కూడా ఎక్కువ పోషకాలను, ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తగిన మోతాదులో తరచూ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.