Palakura Bajji : మనలో చాలా మంది బజ్జీలను ఇష్టంగా తింటూ ఉంటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రకాల బజ్జీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. వాటిలో పాలకూర బజ్జీ కూడా ఒకటి. పాలకూరతో పప్పు, కూర, పాలక్ రైస్ వంటి వాటితో పాటు ఇలా బజ్జీలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ బజ్జీలు చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయి. ఈ బజ్జీలను తయారుచేయడం కూడా చాలా సులభం. 10 నిమిషాల్లో వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, క్రిస్పీగా పాలకూర బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర ఆకులు – 15 నుండి 20, శనగపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, వాము – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, వేడి నూనె – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పాలకూర బజ్జీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, వాము, పసుపు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా, మరీ చిక్కగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఇందులో వేడి నూనె వేసి కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పాలకూర ఆకును పిండిని ముంచి నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసేటప్పుడు పాలకూర ఆకుకు రెండు వైపులా పిండి చక్కగా పట్టేలా చూసుకోవాలి.
తరువాత వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకూర బజ్జీ తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడంతో పాటు పప్పు వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు. వర్షం పడేటప్పుడు ఇలా ఇంట్లోనే అప్పటికప్పుడు పాలకూర బజ్జీలను తయారు చేసుకుని తింటూ వర్షాన్ని ఎంజాయ్ చేయవచ్చు.