Jhal Muri : మనం మరమరాలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. మరమరాలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరమరాలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో జాల్ మురీ కూడా ఒకటి. జాల్ మురీ మనకు ఎక్కువగా బీచ్ ల దగ్గర, రోడ్ల పక్కన లభిస్తూ ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ జాల్ మురీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లోనే దీనిని మనం తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ జాల్ మురీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జాల్ మురీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మరమరాలు – రెండు కప్పులు, పుట్నాల పప్పు – పావు కప్పు, సేవ్ – అర కప్పు, వేయించిన పల్లీలు – పావు కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట -1, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క.
జాల్ మురీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మరమరాలను తీసుకోవాలి. తరువాత ఇందులో పైన చెప్పిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జాల్ మురీ తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చాలా సులభంగా జాల్ ముర్రీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.