Betel Leaf : తమలపాకులు.. ఇవి మనందరికి తెలిసినవే. ఇవి చక్కటి వాసనను, ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. హిందూ సంప్రదాయంలో తమలపాకులకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాలలో వీటిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటాము. ఆధ్యాత్మికంగానే కాకుండా ఔషధంగా కూడా తమలపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని తమలపాకులను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాత, కఫ దోషాలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. తమలపాకులో ఉండే ఔషధ గుణాలను అలాగే దీని వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకులో నొప్పిని నివారించే గుణం కూడా ఉంది. తలనొప్పిని తగ్గించడంలో తమలపాకు అద్భుతంగా పని చేస్తుంది. తమలపాకును కచ్చా పచ్చాగా దంచి నుదుటి మీద ఉంచాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అలాగే జీర్ణశక్తిని పెంచడంలోకూడా తమలపాకు మనకు సహాయపడుతుంది. తమలపాకును నమలడం వల్ల నోట్లో లాలాజలాన్ని ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్దకాన్ని తగ్గించడంలో కూడా తమలపాకు మనకు సహాయపడుతుంది. ఉదయం పరగడుపున తమలపాకును నమిల తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది.
పొట్టలో పేరుకుపోయిన మలినాలను, విష పదార్థాలను తొలగించి ఆకలి పెరిగేలా చేయడంలో కూడా తమలపాకు మనకు దోహదపడుతుంది. అలాగే తమలపాకును నమిలి తినడం వల్ల నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. చిగుళ్లు మరియు దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే తమలపాకుకు ఆవాల నూనె రాసి ఆకును వేడి చేయాలి. తరువాత ఈ ఆకును ఛాతి మీద వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే దగ్గు సమస్యతో బాధపడుతున్నప్పుడు తమలపాకును నమిలి తినడం వల్ల దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే తమలపాకు యాంటీ సెప్టిక్ గా కూడా పని చేస్తుంది. పసుపును, తమలపాకును మెత్తని పేస్ట్ గా చేసి గాయాలపై రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. ఈ విధంగా తమలపాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ ఒకటి చొప్పున తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకునే ముందు ఆకు మొదట్లో ఉండే కాండాన్ని తీసేసి తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.