ప్రపంచ వ్యాప్తంగా ఏటా గుండె జబ్బులు, హైబీపీ, డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అస్తవ్యవస్తమైన జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం.. వంటి అనేక కారణాల వల్ల ఆయా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టైప్ 2 డయాబెటిస్ చాలా మందికి వస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే..
టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన వారు అధిక బరువును సడెన్‌గా కోల్పోతుంటారు. గాయాలు, పుండ్లు నెమ్మదిగా మానుతుంటాయి. అలసట, నీరసం ఉంటాయి. విపరీతమైన దాహం, ఆకలి ఉంటాయి. తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. చర్మం దురదలు పెడుతుంది. మూడ్ మారుతుంది.
మన శరీరంలో క్లోమగ్రంథి (పాంక్రియాస్) ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీన్ని శరీర కణాలు సరిగ్గా ఉపయోగించుకోవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటాయి. ఈ స్థితిని టైప్ 2 డయాబెటిస్ అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారు ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
టైప్ 2 డయాబెటిస్ ఉందో, లేదో నిర్దారించేందుకు ప్లాస్మా గ్లూకోజ్ లెవల్స్ ను రెండు సార్లు పరీక్షిస్తారు. పరగడుపున ఒకసారి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత 2 గంటలకు గ్లూకోజ్ స్థాయిలను పరీక్షిస్తారు. ఈ క్రమంలో పరగడుపున గ్లూకోజ్ లెవల్స్ 120 కన్నా ఎక్కువగా, బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత 2 గంటలకు గ్లూకోజ్ లెవల్స్ 160 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని టైప్ 2 డయాబెటిస్‌గా నిర్దారిస్తారు. ఈ విలువలు వస్తే డయాబెటిస్ ఉన్నట్లు నిర్దారించుకుని డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వేళకు నిద్రించాలి. వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు.