Hotel Style Chicken Curry : మనకు రెస్టారెంట్ లలో ల భించే చికెన్ వెరైటీలల్లో చికెన్ గ్రేవీ కర్రీ కూడా ఒకటి. ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. చికెన్ ముక్కలు కూడా ఎంతో మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటాయి. రోటీ, చపాతీ, పుల్కా, నాన్, బటర్ నాన్ ఇలా అన్నింటిలోకి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఈ చికెన్ గ్రేవీ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్సెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే కమ్మటి చికెన్ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ గ్రేవీ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, లవంగాలు – 3, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీఆకు – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నీళ్లు -అర కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూన్, ప్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్స్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, బిర్యానీ ఆకు – 1, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, అల్లం ముక్కలు -ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, టమాట ముక్కలు – అర కప్పు, పసుపు – కొద్దిగా, పుదీనా – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చికెన్- ముప్పావుకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పెరుగు, నూనె వేసి ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. రాత్రంతా కుదరని వారు కనీసం ఒక గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత మసాలా పేస్ట్ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, టమాట ముక్కలు, పసుపు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లో వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత కర్రీ తయారీకి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ధనియాల పొడి వేసి వేయించాలి. ఈ పేస్ట్ ను నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత చికెన్ వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ ఉడికిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, ప్రెష్ క్రీమ్, కసూరిమెంతి వేసి కలపాలి.దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ తయారవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.