Masala Aloo Kurma With Gravy : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని మనం తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఆలూ మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఆలూ మసాలా కర్రీని ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే మసాలా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. మరింత రుచిగా ఆలూ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బంగాళాదుంపలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – 2 టీ స్పూన్స్, జీడిపప్పు – 5, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు లేదా తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు, జీలకర్ర, ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత నువ్వులు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.తరువాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.
తరువాత నీళ్లు పోసి కలిపి కలపాలి. దీనిపై మూత పెట్టి బంగాళాదుంప ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ముక్కలు ఉడికి కూర దగ్గర పడిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే ఆలూ మసాలా కర్రీల కంటే ఈ విధంగా తయారు చేసిన కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.