Dal Puri : దాల్ పూరీ.. లోపల దాల్ స్టఫింగ్ తో చేసే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ చేసే పూరీల కంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా మరింత రుచిగా దాల్ పూరీలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ దాల్ పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్ పూరీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన శనగపప్పు – అర కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – చిటికెడు, గోధుమపిండి – ఒక కప్పు, కారం – అర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
దాల్ పూరీ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో శనగపప్పును తీసుకోవాలి. ఇందులో నీళ్లు, పసుపు, గరం మసాలా వేసి మూత పెట్టాలి. ఈ పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి.ఇప్పుడు కుక్కర్ మూత తీసి అందులో ఎక్కువగా ఉండే నీటిని తీసి వేయాలి. ఈ కుక్కర్ ను మరలా స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసి పప్పును స్మాషర్ తో మెత్తగా చేసుకోవాలి. ఈ శనగపప్పు మిశ్రమం పొడి పొడిగా అయిన తరువాత నిమ్మరసం, కొత్తిమీర వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత పిండిని మరోసారి కలుపుకుని సమానంగా ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ఒక్కో ఉండను తీసుకుని పలుచగా వత్తుకోవాలి. తరువాత ఇందులో శనగపప్పు మిశ్రమాన్ని ఉంచి పగుళ్లు లేకుండా అంచులను మూసి వేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ నూనె వేసుకుంటే వత్తుకోవాలి. తరువాత ఈ పూరీలను వేడి వేడి నూనెలో వేసి కాల్చుకోవాలి. ఈ పూరీ మరీ ఎక్కువగా పొంగవు. వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ పూరీలు తయారవుతాయి. వీటిని పెరుగు, ఆవకాయతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన దాల్ పూరీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.