Jonna Pindi Paratha : జొన్నపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. జొన్నపిండితో చేసే వాటిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. జొన్నపిండితో తరుచూ ఒకేరకం రొట్టెలు కాకుండా దీనితో మనం పరోటాలను కూడా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. జొన్నపిండితో రుచిగా, మెత్తగా ఉండే పరోటాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్నపిండి పరాటాల తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నపిండి – ఒక కప్పు, గోధుమపిండి – పావు కప్పు, తరిగిన మెంతికూర – ఒక కప్పు, ఉప్పు- తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నువ్వులు – 3 టీ స్పూన్స్, పెరుగు – ముప్పావు కప్పు, నూనె – 2 టీ స్పూన్స్.
జొన్నపిండి పరాటాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జొన్నపిండిని తీసుకోవాలి. తరువాత గోధుమపిండి వేసి కలపాలి. తరువాత పెరుగు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత నూనె, కొద్ది కొద్దిగా పెరుగు వేసి కలపాలి. ఇందులో నీళ్లు వేయకుండానే అంతా కలిసేలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత పిండి ముద్దను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పరోటాలా మందంగా వత్తుకోవాలి. అవసరమైతే అంచులను గుండ్రంగా కట్ చేసుకుని వాటిపై మరిన్ని నువ్వులను వేసి వత్తుకోవాలి.
తరువాత దీనిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె లేదా నెయ్యి వేస్తూ రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్నపిండి పరాటాలు తయారవుతాయి. వీటిని నేరుగా ఇలాగే తీసుకోవచ్చు లేదా రైతా వంటి వాటితో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా జొన్నపిండితో తయారు చేసిన పరాటాలను తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.