Roasted Gram : శనగలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటినే రోస్ట్ చేస్తారు. వాటిని పుట్నాలుగా పిలుస్తారు. అయితే ఇవి మనకు మార్కెట్‌లో రెండు రకాలుగా లభిస్తాయి. పొట్టు ఉన్నవి, పొట్టు లేనివి. ఈ క్రమంలో రెండింటిలో ఏ తరహా పుట్నాలను తింటే మనకు మేలు జరుగుతుందోనని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే ఇందుకు డైటిషియన్ ఆయుషి యాదవ్ ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు మార్కెట్‌లో రెండు రకాల పుట్నాలు లభిస్తాయి. అయితే పొట్టు ఉన్న పుట్నాలను తింటేనే మనకు ఎక్కువ మేలు జరుగుతుంది. ఎందుకంటే పొట్టుతో ఉన్న వాటిని తింటే మనకు ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. అలాగే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. అలాగే పుట్నాల పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్లు రాకుండా చూస్తాయి.
చర్మం కాంతివంతంగా మారుతుంది..
పుట్నాలను పొట్టుతో సహా తింటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలను డ్యామేజ్ అవకుండా చూస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. ఇక పొట్టు తీసిన పుట్నాలను తింటే మనకు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా లభిస్తాయి. అయినప్పటికీ వీటితోనూ మనం ప్రయోజనాలను పొందవచ్చు. కొందరికి ఫైబర్ సరిగ్గా జీర్ణం అవదు. జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు పొట్టు తీసిన పుట్నాలను తింటే మంచిది. దీంతో అన్ని రకాల పోషకాలను పొందవచ్చు.
ఏ పుట్నాలను తినాలి..
అయితే మన ఆరోగ్యానికి ఏ తరహా పుట్నాలను తింటే మంచిదని చాలా మంది అడుగుతుంటారు. జీర్ణ సమస్యలు లేని వారు, జీర్ణశక్తి ఎక్కువగా ఉండేవారు పొట్టు తీయని పుట్నాలను తింటేనే మంచిది. అదే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం పొట్టు తీసిన పుట్నాలను తినాలి. దీంతో వాటి ద్వారా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. పుట్నాలను తినడం వల్ల మన రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. రోగాల నుంచి త్వరగా కోలుకుంటారు. పొట్టుతో ఉన్న పుట్నాలను తింటే ఐరన్ కూడా సమృద్ధిగానే లభిస్తుంది. ఇది రక్తాన్ని తయారు చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. కనుక పుట్నాలను రోజూ తింటే మనకు ఎంతో మేలు జరుగుతుంది.