Ajwain Plant : చాలా మంది తమ ఇళ్లలో రకరకాల అలంకరణ మొక్కలను పెంచుతుంటారు. వీటి వల్ల ఇంటికి చక్కని అందం వస్తుంది. ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే వీటితోపాటు మూలికల జాతికి చెందిన మొక్కలను గనక మనం ఇంట్లో పెంచితే వాటితో మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాంటి వాటిల్లో వాము మొక్క కూడా ఒకటి. దీన్ని ఈమధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో పెంచుతున్నారు. వాము మొక్క మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనకు కలిగే అనేక వ్యాధుల నుంచి ఈ మొక్క ఆకులు మనల్ని రక్షిస్తాయి. అనేక రోగాలను తగ్గేలా చేస్తాయి. అయితే వాము మొక్కలను మనం ఇంట్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
వాము మొక్కలను పెంచేందుకు నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉంటాయి. వాటిని తెచ్చి నాటి పెంచవచ్చు. లేదా వాము విత్తనాలను చల్లి కూడా ఈ మొక్కలను పెంచవచ్చు. ఇందుకు గాను మట్టితో నిండిన కుండీలో పావు ఇంచు లోతులో వాము విత్తనాలను చల్లాలి. కుండీ మొత్తం ఇలా విత్తనాలను చల్లవచ్చు. తరువాత కుండీపై ప్లాస్టిక్ షీట్‌తో కవర్ చేయాలి. దీంతో కుండీలో తేమ వాతావరణం ఏర్పడుతుంది. ఇది విత్తనాలు మొలకెత్తేందుకు సహాయ పడుతుంది. అయితే ఈ కుండీలో నీళ్లు పోయాల్సిన పనిలేదు. తేమతోనే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఇందుకు గాను కనీసం 1 లేదా 2 వారాల వరకు సమయం పడుతుంది.
4 వారాలపాటు ఉంచాలి..
అయితే మొలకలు వచ్చిన వెంటనే వాటిని వేరే కుండీల్లోకి మార్చకూడదు. మరో 4 వారాల పాటు అలాగే ఉంచాలి. దీంతో కాస్త పెరుగుతాయి. అప్పుడు వాటిని మీరు కావాలంటే వేరే కుండీల్లోకి మార్చుకోవచ్చు. ఇలా వాము మొక్కలను మీరు ఇంట్లో ఎంతో సులభంగా పెంచవచ్చు. అయితే ఈ మొక్కలకు చీడపీడల బెడద ఉండదు. కానీ నీళ్లను రోజూ పోయాల్సి ఉంటుంది. రోజూ సాయంత్రం సమయంలో కుండీలో ఉన్న తడిని చూసి నీళ్లను పోయాలి. నీళ్లను మరీ ఎక్కువగా పోయకూడదు.
వాము మొక్కను సూర్యరశ్మి తగిలేలా ఉంచాలి. అయితే ఇంట్లో పెట్టదలిస్తే ఈ మొక్కలకు రోజుకు కనీసం 2 గంటలు అయినా సూర్యరశ్మి తగిలే విధంగా చూసుకోవాలి. ఈ మొక్కలకు రసాయన ఎరువులు కాకుండా వీలైనంత వరకు సేంద్రీయ ఎరువులను వాడడం మంచిది. అలాగే మట్టి కూడా మంచి సారవంతమైనది అయితే ఇంకా మంచిది. ఇక వాము మొక్కలను పెంచేందుకు వర్షాకాలం, చలికాలం అనువైన సమయాలుగా చెప్పవచ్చు. ఈ సీజన్‌లో అవి బాగా పెరుగుతాయి.
వాము ఆకులతో ఎన్నో లాభాలు..
ఇలా వాము మొక్కలను మనం ఇంట్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు. వాము ఆకులతో టీ తయారు చేసి తాగితే మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం వచ్చిన వారు తాగితే త్వరగా కోలుకుంటారు. అలాగే కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ వాము మొక్కలను తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోవాలి. దీంతో ఆరోగ్యపరంగా ప్రయోజనాలను పొందవచ్చు.