ఉబ్బసం.. దీన్నే ఆస్తమా అంటారు. ఇది ఊపిరితిత్తుల మార్గాలను ప్రభావితం చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 235 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. పిల్లలు, పెద్దల్లోనూ ఆస్తమా వస్తుంటుంది. అయితే ఆస్తమాకు వైద్యులు సూచించే మందులను వాడుతూ పోషకాహారం తీసుకోవడంతోపాటు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
నిత్యం మనం కూరల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలను వేస్తుంటాం. నిజానికి వీటిల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అందవల్ల ఆస్తమాను తగ్గిస్తాయి. రోజూ ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే తింటుండాలి. ఆహారంలో పచ్చి ఉల్లిపాయలను రోజుకు 50 గ్రాముల మోతాదులో తింటుండాలి. దీంతో ఆస్తమా తగ్గుతుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీన్ని కప్పు మోతాదులో రోజుకు ఒక్కసారి తాగాలి.
అవిసె గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. నిత్యం వీటిని గుప్పెడు మోతాదులో తింటుంటే ఆస్తమా, గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, మధుమేహం వంటి అనేక వ్యాధుల నుండి బయట పడవచ్చు.
విటమిన్ డి, సిలు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నా ఆస్తమా తగ్గుతుంది. విటమిన్ డి మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అలాగే పుట్ట గొడుగులు, కోడిగుడ్డులోని పచ్చని సొన, పాలు, పెరుగులలో విటమిన్ డి ఉంటుంది. ఇక విటమిన్ సి క్యాప్సికం, జామకాయలు, ఉసిరి, నిమ్మ, నారింజ, కివీ, బొప్పాయి, టమాటాలు వంటి ఆహారాల్లో లభిస్తుంది. వీటిని తింటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆస్తమాను తగ్గించడంలో సహాయ పడుతుంది. రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. లేదా ఉదయం పరగడుపున పసుపు వేసి మరిగించిన నీటిని తాగుతుండాలి. దీంతో కూడా ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.