మన దేశంలో అనేక వర్గాల వారు తమ తమ సాంప్రదాయల ప్రకారం వివాహాలు చేసుకుంటారు. అయితే ఉంగరాలను ధరించాల్సి వస్తే మాత్రం కుడి చేతి 4వ వేలికి వాటిని ధరిస్తారు. కానీ పాశ్చాత్య దేశాల్లో వివాహం చేసుకుంటే ఉంగరాన్ని ఎడమ చేయి 4వ వేలికి ధరిస్తారు. అయితే కుడి లేదా ఎడమ.. ఏ చేయి అయినా సరే ఉంగరాలను ఎక్కువగా చేతికి ఉన్న 4వ వేలికే ధరిస్తారు. దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేతులకు ఉండే 4వ వేలిలోని నాడులు నేరుగా గుండెకు కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల ఆ వేలికి ఉంగరాన్ని ధరిస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుందని నమ్మేవారు. అలా ఒకప్పుడు ఈ పద్ధతి ప్రారంభమైంది. ఆక్యుపంక్చర్ అనే వైద్య విధానంలో నిర్దిష్టమైన నాడులపై ఒత్తిడిని కలగజేస్తే పలు సమస్యలు తగ్గుతాయి. అందువల్లే చేతి 4వ వేలిలో ఉండే నాడులపై ఉంగరాలు ఒత్తిడిని కలగజేస్తాయి. దీంతో ఆ నాడులు గుండెకు అనుసంధానం అయి ఉంటాయి కనుక గుండె జబ్బులు రాకుండా ఉంటాయని చెబుతారు. ఈ కారణం వల్లే ఎప్పటి నుంచో ఉంగరాలను 4వ వేలికి ధరిస్తూ వస్తున్నారు.
ఇక దీని వెనుక ఉన్న ఇంకో కారణం ఏమిటంటే.. కొన్ని దేశాల వారు చేతులకు ఉండే ఉంగరం వేళ్లకు ఉంగరాలను ధరిస్తే వారికి పెళ్లయినట్లు భావిస్తారు. ఉంగరం వేళ్లకు ఉంగరాలు ఉంటే వారికి పెళ్లయిందని గుర్తిస్తారు. పెళ్లయిన వారిని గుర్తించేందుకు ఒకప్పుడు ఇలా కొన్ని వర్గాల వారు ఉంగరం వేళ్లకు ఉంగరాలను ధరించేవారు. అది అలా కొనసాగుతూ వస్తోంది. అందుకనే వివాహాల్లో కచ్చితంగా ఉంగరాలను చేతి 4వ వేలికే ధరింపజేస్తారు.
ఇక అప్పట్లో మన పూర్వీకులు చెవులను కుట్టించుకునేవారు. అయితే వాటికి అనుసంధానంగా ఉండే నాడులు ఉంగరం వేళ్లలో ఉంటాయి. ఉంగరం వేళ్లకు ఉంగరాలను ధరిస్తే వాటిపై పడే ఒత్తిడితోపాటు చెవులపై కలిగే ఒత్తిడి.. రెండూ సమం అవుతాయి. దీంతో అనారోగ్యాలు రాకుండా ఉండేవని నమ్మేవారు. అందువల్లే ఉంగరం వేళ్లకు ఉంగరాలను ధరించేవారు. అయితే 4వ వేళ్లకు ఉంగరాలను ధరించడం వల్లే వాటికి ఉంగరం వేళ్లని పేరు వచ్చింది. ఈ క్రమంలో సహజంగానే చాలా మంది అవే వేళ్లకు ఉంగరాలను ధరిస్తూ వస్తున్నారు. అది అలా కొనసాగుతోంది.