Hibiscus Gardening : మనం ఇంట్లో పెంచుకోదగిన అందమైన మొక్కలల్లో మందార మొక్క కూడా ఒకటి. మందార మొక్క మనకు అనేక రంగులల్లో లభిస్తుంది. చాలా మంది దీనిని ఇండ్లల్లో పెంచుకుంటారు. అలాగే పార్కులల్లో కూడా ఈ మొక్కలను ఎక్కువగా పెంచుతారు. దేవుడికి కూడా మందార పూలన సమర్పిస్తూ ఉంటారు. ఇంటి పెరట్లో మందార మొక్క ఉంటే ఆ ఇంటికే ఎంతో అందం వస్తుంది. ఇంట్లో ఒక్క మందార మొక్క ఉంటే చాలు మనకు సంవత్సరమంతా పూలు వస్తూనే ఉంటాయి. అలాగే మందార పువ్వులను, ఆకులను జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మందార ఆకులను, పువ్వులను నూనెలో వేసి మరిగించి ఆ నూనె ను జుట్టుకు రాసుకోవడం అలాగే మందార ఆకులను, పూలను పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించడం వంటివి చేస్తూ ఉంటారు. మందార మొక్కను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు తీరుతాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా కూడా వెల్లడించారు.
ఇలా మందార మొక్క ఇంటితో పాటు మన జుట్టుకు కూడా ఎంతో అందాన్ని తీసుకువస్తుంది. అలాగే మందార కూడా చాలా సులభంగా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ మొక్కకు కూడా చీడ పడుతూ ఉంటుంది. అనేక రకాల క్రిమి కీటకాలు దాడి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా తెల్ల నల్లి, పేనుబంక వంటి చీడలు పడుతూ ఉంటాయి. దీంతో ఆకులు ముడుచుకోవడం, పూలు సరిగ్గా రాకపోవడం, ఆకులు పసుప రంగులోకి మారడం వంటివి జరుగుతాయి. మందార చెట్టుకు పట్టిన ఈ చీడలను పోగొట్టడానికి అందరూ క్రిమి సంహారాలను వాడలేరు. అలాగే సహజ సిద్దంగా మొక్కలను పెంచాలనుకునే వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటించడం వల్ల మందార మొక్కకు పట్టిన చీడలన్నింటిని తొలగించవచ్చు. ఎటువంటి క్రిమి సంహారాలు వాడకుండానే మొక్కను తిరిగి ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ చీడలను తొలగించడానికి గానూ మనం ఒక స్ప్రేను తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
దీని కోసం ఒక గ్లాస్ మజ్జిగను ఒక గిన్నెలో పోసి వారం రోజుల పాటు పులియబెట్టాలి. రోజులో రెండుసార్లు గిన్నెపై ఉండే మూతను తీస్తూ ఉండాలి. మజ్జిగ పులిసిన తరువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని అందులో అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో పులియబెట్టిన మజ్జిగను కూడా పోసి కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ పోసుకుని మందార చెట్టు అంతా తడిసేలా బాగా స్ప్రే చేయాలి. ప్రతి ఆకు రెండు వైపులా, అలాగే కాండం మొదలు నుండి చివరి వరకు అంతా తడిసేలా బాగా స్ప్రే చేసుకోవాలి. అలాగే కొద్ది మొత్తంలో ఈ ద్రావణాన్ని చెట్టు మొదలులో కూడా పోయాలి. ఇలా చేయడం వల్ల మందార మొక్కకు పట్టిన చీడలన్ని నశిస్తాయి. అలాగే మొక్క కూడా ఏపుగా పెరుగుతుంది. పూలు కూడా మరింత అందంగా, బలంగా పూస్తాయి. ఈ చిట్కాను వాడడం వల్ల మనక కానీ, మొక్కకు కానీ ఎటువంటి హాని కలగదు.