ఇప్పుడు మార్కెట్‌లో హీరో, హోండా విడి విడిగా వాహనాలను విక్రయిస్తున్నాయి. కానీ కొన్నేళ్ల ముందు ఈ రెండు కలిపి హీరో హోండా వాహనాలను విక్రయించేవి. ఈ కంపెనీ కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది. పాత వాహనాలు అయినా సరే రీసేల్‌లో మంచి విలువ వచ్చేవి. అలాగే మైలేజీ, నాణ్యతకు పెట్టింది పేరుగా ఉండేవి. మరలాంటప్పుడు ఈ రెండు కంపెనీలు అసలు ఎందుకు విడిపోయాయి.. ఇవి విడిపోవడానికి గల కారణాలు ఏమిటి.. అన్న వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
హీరో హోండా వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వాటిని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయాలని హీరో కంపెనీ భావించింది. కానీ అందుకు హోండా అంగీకరించలేదు. ఎందుకంటే ఇది వరకే ఇతర దేశాల్లో హోండా వాహనాలు ఉన్నాయి. ఒక వేళ హీరో హోండా వాహనాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే హోండా వాహనాలకు పోటీ వస్తాయి. కనుక దీనికి హోండా అంగీకరించలేదు. అలాగే హీరో కంపెనీ స్వయంగా ఆర్ అండ్ డి ల్యాబ్ పెట్టాలని అనుకుంది. ఇది కూడా హోండాకు నచ్చలేదు.
ఇక హోండా అనే పేరు వాడుకున్నందుకు గాను హీరో కంపెనీ హోండాకు రాయల్టీలను చెల్లిస్తూ వచ్చింది. ఒకానొక దశలో రాయల్టీ మొత్తాన్ని పెంచాలని హోండా కోరింది. కానీ అందుకు హీరో ఒప్పుకోలేదు. అలాగే స్పేర్ పార్ట్స్‌ను తాము తయారు చేస్తామని హోండా చెబితే అందుకు హీరో అంగీకరించలేదు. ఇలా అనేక విషయాల్లో హీరో, హోండా కంపెనీలకు భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫలితంగా ఆ రెండు కంపెనీలు విడిపోయాయి. అయితే 2010లో ఈ రెండు కంపెనీలు విడిపోయినప్పుడు హీరోకు 44 శాతం, హోండాకు 13.3 శాతం మార్కెట్ షేర్ ఉండేది. కానీ హీరో కంపెనీ మార్కెట్ షేర్ తగ్గుతూ హోండా కంపెనీ మార్కెట్ షేర్ పెరుగుతూ వచ్చింది. 2022 లెక్కల ప్రకారం ఆ సంవత్సరం అక్టోబర్ వరకు హీరోకు 24.5 శాతం మాత్రమే మార్కెట్ షేర్ ఉండగా, హోండాకు 27.98 శాతం మార్కెట్ షేర్ ఉంది.