మన దేశంలో రైళ్లలో అనేక రకాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కొన్ని ప్యాసింజర్ ట్రెయిన్స్ అయితే కొన్ని ఎక్స్ ప్రెస్ ట్రెయిన్స్, మరికొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్స్ ఉంటాయి. ఇవే కాకుండా గూడ్స్ రైళ్లు కూడా ఉంటాయి. అయితే ఏ రైలుకైనా ఇంజిన్ ఉంటుంది కదా, దానిపై WAP 5 లేదా, WDM 3A వంటి కొన్ని అక్షరాలు ఉంటాయి, జాగ్రత్తగా గమనించారా..? అవును ఉంటాయి. కానీ మీరు వాటిని పట్టించుకుని ఉండరు. అయితే జాగ్రత్తగా పరిశీలించాలే గానీ వాటి వల్ల మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అవేమిటంటే…
రైలు ఇంజిన్లపై ఉండే WAP 5 వంటి అక్షరాలకు అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పైన చెప్పిన అక్షరాల్లో మొదటి అక్షరం W ఉంటే అది వైడ్ గేజ్ అని అర్థం. అంటే రైలు పట్టాల నిడివి. సాధారణంగా మనం ప్రయాణించే రైళ్ల పట్టాల గేజ్ ఇదే. 5 అడుగులు ఉంటుంది. అదే మొదటి అక్షరం Y ఉంటే అది మీటర్ గేజ్ అని అర్థం. దీని పట్టాల నిడివి 3 అడుగులు ఉంటుంది. మొదటి అక్షరం Z ఉంటే నారో గేజ్ అని అర్థం. పట్టాల నిడివి 2 అడుగుల 6 ఇంచులు ఉంటుంది. ఇక మొదటి అక్షరం N ఉంటే నారో గేజ్ అనే అర్థం వస్తుంది. కాకపోతే పట్టాల నిడివి 2 అడుగులు మాత్రమే ఉంటుంది.
ఇక పైన చెప్పిన అక్షరాల్లో రెండో అక్షరం A ఉంటే ఎలక్ట్రికల్ ఇంజిన్ అని, D ఉంటే డీజిల్ ఇంజిన్ అని, C ఉంటే డీసీ ఎలక్ట్రిక్ ఇంజిన్ అని, CA రెండు ఉంటే డీసీ, ఏసీ కరెంట్‌పై నడిచే ఇంజిన్ అని, B అని ఉంటే బ్యాటరీపై నడిచే ఇంజిన్ అని అర్థాలు వస్తాయి. ఇక మిగిలిన మూడవ అక్షరంలో G అని ఉంటే గూడ్స్ ఇంజిన్ అని, P అని ఉంటే ప్యాసింజర్స్‌ను తీసుకెళ్లే రైలు ఇంజిన్ అని, M అని ఉంటే ప్యాసింజర్, గూడ్స్ ఇంజిన్ అని, S ఉంటే ఇంజిన్‌లను మార్చే ఇంజిన్ అని, U ఉంటే అర్బన్ మెట్రో ఇంజిన్ అని, R ఉంటే రైల్ కార్ అని తెలుసుకోవాలి.
ఇక చివరిగా ఉన్న 5 అంకె లోకోమోటివ్ ఇంజిన్ గ్రేడ్, జనరేషన్‌ను సూచిస్తుంది. 5వ తరం ఇంజన్ అన్నదాన్ని తెలియజేయడం కోసమే ఆ నంబర్ వేస్తారు. అయితే కొన్ని రైలు ఇంజిన్‌లకు WDM 3A అని ఉంటుంది. ఇందులో మొదటి మూడు అక్షరాలకు మనకు అర్థాలు తెలుసు. W అంటే వైడ్‌గేజ్, D అంటే డీజిల్ ఇంజిన్, M అంటే ప్యాసింజర్, గూడ్స్ ఇంజిన్ అని తెలుస్తుంది. మరి చివరిగా ఉన్న 3A కు అర్థం ఏమిటంటే… ఆ రైలు ఇంజిన్ పవర్ అన్నమాట. 3A అంటే 3000 hp అని అర్థం వస్తుంది. అదే 5A ఉంటే 5000 hp అని తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకున్నారుగా, రైలు ఇంజిన్లపై ఉండే ఆ అక్షరాలకు అర్థాలు ఏమిటో…!