పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా చాలామంది సిగరెట్ కి అలవాటు పడిన వాళ్లు అంత త్వరగా మానలేరు.. సిగరెట్ ని తమ దైన స్టైల్లో వెలిగించడం..పొగని రింగులు రింగులుగా వదలడం చేస్తుంటారు.. సిగరెట్ మొత్తం అయిపోయాక సిగరెట్ పీక విసిరి కొట్టడం లేదా కాలి కింద నలిపి పక్కకి నెట్టడం చేస్తుంటారు.. అలా విసిరేసిన సిగరెట్ పీక భూమిలో డీ కంపోజ్ అవ్వడానికి ఏడాది నుండి పదేళ్లు పడ్తుంది…ఒకవైపు ప్లాస్టిక్ పర్యావరణానికి హాని చేస్తుందనుకుంటే,ఇంత చిన్న సిగరెట్ పీక కూడా మెల్లిగా మట్టిని తినేస్తుంది…ఇప్పుడు ఈ కథంతా ఎందుకంటే సిగరెట్ తాగడం వలన ఎలాగు ఆరోగ్యం పోతుంది..సిగరెట్ పీకల వలన వచ్చే డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి… సిగరెట్ పీకలతో డబ్బులు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి..
సిగరెట్ తయారీలో సెల్యులోజ్ ఎసిటేట్ అనే నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఫిల్టర్ వాడతారు. అది పర్యావరణానికి అత్యంత ప్రమాదకారి.ప్రపంచ వ్యాప్తంగా ప్రతీరోజు టన్నుల కొద్దీ సిగరెట్ పీకలు భూమ్మీద పేరుకుపోతున్నాయి. ఒక్క ఇండియాలోనే ఏడాదికి తాగి పారేసిన సిగరెట్ పీకల సంఖ్య 100 బిలియన్లు ఉంటుందని అంచనా. ఇదే విషయం మీద స్టడీ చేసిన గూర్గావ్ కు చెందిన విషాల్ కాంత్, నమన్ గుప్త అనే ఇద్దర స్నేహితులు. ఈ వేస్టేజీనంతా రీ రీ సైకిల్ లాంటిది చేయలేమా అని ఆలోచించారు. ఒకసారి ఏదో పార్టీకి వెళ్లారు. అక్కడ తాగి పడేసిన కొన్ని వందల సిగరెట్ ఫిల్టర్లను గమనించారు. ఆశ్చర్యపోయారు. ఒక పార్టీలోనే ఇన్ని పీకలుంటే దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఇంకెన్ని సిగరెట్ ఫిల్టర్లు ఇలా పడిపోతున్నాయని ఆలోచించారు. అలాంటి సంఘర్షణలోంచి పుట్టిందే కోడ్ అనే స్టార్టప్ ఐడియా.
తాగిపారేసిన సిగరెట్ ఫిల్టర్లను రీ సైకిల్ చేయడం ఈ స్టార్టప్ మెయిన్ కాన్సెప్ట్. 2016 జూలైలో లాంఛ్ అయిన ఈ స్టార్టప్.. సిగరెట్ పీకల రీసైక్లింగ్ కి వన్ స్టాప్ సొల్యూషన్ కనిపెట్టిందని చెప్పొచ్చు. స్టార్టప్ అయితే స్టార్ట్ చేశారు.. బానే ఉంది కానీ సిగరెట్ పీకలను సేకరించడం కష్టమైన పనే. అందుకే దానికీ ఒక పరిష్కారం కనిపెట్టారు. ఎవరైతే తమకు సిగరెట్ పీకలు కలెక్ట్ చేసి ఇస్తారో.. వాళ్లకు కిలోల చొప్పున కొంత డబ్బు ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఉదాహరణకు పాన్ షాప్ దగ్గర ఒక డబ్బా పెడతారు. అక్కడే తాగినవాళ్లు దాంట్లో పడేసేలా చేయడం షాప్ అతని బాధ్యత. అలా కిలో సేకరిస్తే రూ. 700 ఇస్తున్నారు. అంత పెద్దమొత్తం కలెక్ట్ కాకుంటేవందగ్రాములకు 100 రూపాయల చొప్పున పే చేస్తారు. ఈ విషయం తెలిసి.. సిగరెట్ తాగేవాళ్లు కూడా అడ్డగోలుగా పడేయకుండా ఒకచోట జమచేసి వీళ్లకు అందజేస్తున్నారు.
గత మూడు నెలల్లో పది కిలోల దాకా ఫిల్టర్లను సేకరించారు. అందులో పొగాకు, ఫిల్టర్, పేపర్ అంతా కలుపుకుని ఉంది. వీరికి 50 మంది వెండర్లు, 70 మంది కస్టమర్లు తోడయ్యారు. వీ బిన్స్ అనే పేరుతో పాన్ షాపుల దగ్గర, క్రౌడ్ ఏరియాల్లో డబ్బాలు పెట్టి పీకలు సేకరిస్తున్నారు. ప్రతీ 15 రోజులకోసారి గార్బేజీ తీసుకెళ్తారు.బీఐఎస్ లాబ్స్ నిబంధనల ప్రకారం అత్యంత జాగ్రత్తగా, ఏమాత్రం హాని కలగకుండా ఈ వేస్టేజీనంతా రీ సైకిల్ చేస్తున్నారు. సంస్థను దేశవ్యాప్తంగా విస్తరించాలనేది ఇద్దరు స్నేహితుల ప్లాన్.