వారమంతా పనిచేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యారు. కానీ మీ భార్య ఇంట్లో అది లేదని, ఇదిలేదని సతాయించేస్తోంది. పిల్లలు షాపింగ్ అంటూ విసిగించేస్తున్నారు. అత్తమామలు, మరదలూ వచ్చి తిష్టవేసి టీవీలు మోగించేస్తూ, వీడియోలు ఆడించేస్తూ ఇల్లంతా ధ్వనులతో నింపేశారు. మీకు భరించలేని తలనొప్పి మొదలవటం….రిలీఫ్ అంటూ ఒక టాబ్లెట్ వేసి దాన్ని నిలిపేయటం చేశారు. అది ఎంత ప్రమాదమో తెలుసా? అసలు తలనొప్పులు ఎందుకు వస్తాయి. అవి ఎన్ని రకాలు? ఏం చేస్తే పోతాయి? మొదలైనవి పరిశీలించండి. మైగ్రేన్ – అధిక శారీరక వేడి లేదా కంటికి శ్రమ అధికం అవటం వలన, హార్మోన్ల స్ధాయిలో అసమతుల్యత వలన మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి తలకు ఒకే పక్క వస్తుంది. నొప్పి కళ్ళకు కూడా పాకుతుంది. వికారం, వాంతులవడం, అలసట, నోటి చేదు మొదలైనవి లక్షణాలు.
మరి ఈ నొప్పి రాకుండా వుండాలంటే….నిద్ర మంచిదే. కానీ తగిన మందు, యోగ, మ్యూజిక్ ధిరపీ వంటివి కూడా సహకరిస్తాయి. టెన్షన్ తలనొప్పి – ఈ తలనొప్పి మెడ, భుజం నొప్పులతో కలసి వస్తుంది. అలసిన కండరాలు తలకు ఒత్తిడి కలిగించి తల, కణతలు, మెడ వంటివి భారంగా వుండేలా చేస్తాయి. ఆఫీసు పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు వంటివి దీనిని కలిగిస్తాయి. ఆల్కహాల్ బాగా తాగడం, కాఫీ అధికం కావటం వంటివి నొప్పి తీవ్రతను పెంచుతాయి. క్లస్టర్ తలనొప్పి – ఇది పై రెంటివలే సాధారణం కాదు. కొద్దిపాటిగా నొప్పి రావటం, పోవటం గా వుంటుంది. కళ్ళ వెంట నీరు, మూసుకుపోతున్న కను రెప్పలు, అలసట, మొదలైన లక్షణాలుంటాయి.
బ్రెయిన్ లో కలిగే మార్పుల వలన ఇది వస్తుంది. మందులు తప్పనిసరి. రూట్ కెనాల్ సమస్యలు, ఎసిడిటీ, ఖాళీ పొట్ట, తలచర్మం పొడారిపోవటం, ఎండకు అధికంగా గడపటం వంటి వి కూడా కొన్ని రకాల తలనొప్పులు తెప్పిస్తాయి. వీటిని పెయిన్ కిల్లర్ లేదా ఇంటి చికిత్సలతో తగ్గించవచ్చు. వీటికి తలకు, మెడకు, భుజాలకు వేడి నూనె మర్దన, వేడినీటి స్నానం, అల్లం, పసుపు పేస్టు రాయటం వంటివి రిలీఫ్ ఇస్తాయి. లేదా యూకలిప్టస్, కర్పూరం మొదలైనవి కూడా రాస్తే బాగా పనిచేస్తాయి.