దెబ్బ తగలడం, అనారోగ్యం, వాపులు… తదితర కారణాల వల్ల శరీరంలోని ఆయా భాగాల్లో అప్పుడప్పుడు మనకు నొప్పులు వస్తుంటాయి. కొన్ని నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం అలా కాదు. అవి ఒక పట్టాన తగ్గవు. అందుకోసం మనం రక రకాల పద్ధతులను పాటిస్తాం. కాపడం పెట్టడం, ఐస్ ప్యాక్ ఉంచడం, స్ప్రే వాడడం, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం చేస్తాం. అయితే… మందులను వాడే సంగతి పక్కన పెడితే సహజ సిద్ధ పద్ధతులైన కాపడం పెట్టడం, ఐస్ ప్యాక్ ఉంచడం వల్లే నొప్పులు బాగా తగ్గుతాయి. కానీ మీకు తెలుసా..? శరీరంలో ఏ ప్రదేశానికి కాపడం పెట్టాలో, ఏ భాగంలో ఐస్ ప్యాక్‌ను ఉంచాలో..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. కీళ్లు, మోకాళ్ల నొప్పులకు కాపడం పెట్టడమే కరెక్ట్. ఇలా చేయడం వల్ల ఆయా ప్రదేశాల్లో ఉండే కండరాలు సాగుతాయి. రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో నొప్పి తగ్గుతుంది. అయితే ఈ నొప్పులకు ఐస్ ప్యాక్‌ను పెడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.
తలనొప్పి వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ పెట్టుకోవడం ఉత్తమం. ఇలా చేస్తేనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులకు గురైన కండరాలు తిరిగి యథాస్థితికి వస్తాయి. తద్వారా నొప్పి ఇట్టే మాయమవుతుంది. మెడనొప్పి వచ్చిన వారు ఎవరైనా సాధారణంగా ఐస్ ప్యాక్‌నే ఉంచుతారు. కానీ మెడనొప్పికి ఐస్ ప్యాక్ కన్నా కూడా వేడిగా కాపడం పెడితేనే ప్రయోజనం ఉంటుంది. ఇది కండరాలను వ్యాకోచింప జేసి నొప్పులను తగ్గిస్తుంది.
చేతులు లేదా కాళ్లు బెణికినప్పుడు వచ్చే నొప్పులకు ఐస్ ప్యాక్ లేదా కాపడం పెట్టడం ఏదైనా చేయవచ్చు. రెండింటిలో దేన్ని పాటించినా కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. చేతి వేళ్లు, మణికట్టు నొప్పులకు ఐస్ ప్యాక్ పెట్టడమే కరెక్ట్. ఇది వాపులను తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలి మడమలు నొప్పిగా ఉంటే వేడిగా కాపడం పెట్టాలి. దీంతో కండరాల్లో రక్త సరఫరా పెరిగి నొప్పి హరించుకుపోతుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.