ఫోన్లు… నేటి తరుణంలో ఇవి కామన్ అయిపోయాయి. ఎవరి చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తోంది. కొందరైతే రెండు రెండు ఫోన్లనే మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఫోన్లను కొన్నాక చాలా కొద్ది రోజులు మాత్రమే వాటిని వాడుతున్నారు. కొత్త మోడల్, ఆకట్టుకునే ఫీచర్లతో ఫోన్లు వస్తే చాలు, పాత వాటిని తీసేసి కొత్త వాటిని వాడుతున్నారు. ఇది సరే.. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ… వారెన్ బఫెట్ తెలుసు కదా. ప్రపంచంలోని టాప్-10 కోటీశ్వరుల్లో ఈయన కూడా ఒకరు. ఎన్ని వేలు, లక్షలు, కోట్ల కోట్ల కోట్ల డబ్బు ఉందో మనం మాటల్లో చెప్పలేం. అంతటి ధనవంతుడు ఆయన. మరి ఆయన ఎలాంటి ఫోన్ వాడుతారో తెలుసా..? ఆ ఏముందీ… ఏ ఐఫోనో వాడుతారు. కోటీశ్వరుడు కదా, అందులో టాప్ మోడల్ వాడుతారు, అవసరం అనుకుంటే ఎన్ని ఫోన్లనయినా వాడుతారు. అంతే కదా.. అంటారా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆయన వాడేది నోకియా ఫోన్..! అది కూడా చాలా పాతది..!
అవును మీరు విన్నది నిజమే. నోకియా అప్పట్లో ఆకట్టుకునే ఫోన్లు తయారు చేసింది కదా. వాటిల్లో ఫ్లిప్ (మడతపెట్టే) ఫోన్లు కూడా ఉన్నాయి. అలాంటి నోకియా ఫ్లిప్ ఫోన్‌నే బఫెట్ ఇప్పటికీ వాడుతున్నారు. ఎందుకో తెలుసా..? ఆ ఏముందీ… సెంటిమెంట్ కావచ్చు, అందుకే వాడుతున్నారు కాబోలు… అనుకుంటే మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే ఆయన సెంటిమెంట్ కోసం ఆ ఫోన్‌ను వాడడం లేదు. ఆయనకు ఓ పాలసీ ఉంది. ఏ వస్తువునైనా కనీసం 20 నుంచి 25 ఏళ్లు వాడాలి అంటారాయన. అందుకే ఆయన ఆ ఫోన్‌ను ఇప్పటికీ వాడుతున్నారు. అయితే వారెన్ బఫెట్ కేవలం ఫోన్‌ను మాత్రమే కాదు, కారును కూడా పాతదాన్నే వాడుతున్నారు. ఒకప్పుడు ఆయన పాత తరం క్యాడిలాక్ కారును వాడే వారు. అయితే దానికి సర్వీసింగ్ చేయడం, స్పేర్లను వేయడం ఆ కంపెనీ వారికి ఇబ్బంది అయింది. దీంతో ఆ కంపెనీ యజమాని స్వయంగా బఫెట్‌ను రిక్వెస్ట్ చేశారట. అందుకు గాను బఫెట్ 2014లో ఆ కారును మార్చి కొత్త క్యాడిలాక్ ఎక్స్‌టీఎస్ కారును తీసుకున్నారు.
వారెన్ బఫెట్‌కు సొంతంగా ఓ జెట్ విమానం కూడా ఉంది. అయితే ఆయన ఎక్కువగా కారులోనే వెళ్తారు. మరీ అత్యవసరం అనుకుంటేనే, అదీ వ్యాపార లావాదేవీల కోసమే ఆ విమానాన్ని వాడుతారట. ఇక బఫెట్ జీవన విధానం కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇప్పటికీ ఆయన 3 గదుల ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. దాన్ని ఆయన 1958లో కొన్నారు. అప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఇక బఫెట్ తన జీవిత కాలంలో ఇప్పటి వరకు ఈ-మెయిల్ ను అసలు వాడలేదు తెలుసా..? కేవలం ఒకే ఒక్కసారి మెయిల్ పంపారు. టెక్నాలజీ అంటే ఆయనకు భయం కాబోలు, అందుకే దాన్ని వాడరు అనుకుంటా..? అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అసలు నిజం అది కాదు. ఆయనకు సింపుల్‌గా ఉండడమే ఇష్టం. తన కెరీర్‌ను ఎలా ప్రారంభించారో ఇప్పటికీ అలాగే ఉండాలని ఆయన కోరుకుంటారు. అందుకే ఆయన ఈ-మెయిల్ వాడరు. అంతేకాదు, ఆయనకు క్రెడిట్ కార్డ్స్ కూడా లేవు తెలుసా..? సామాన్యునిగా జీవితం గడపాలనే ఆయన ఇప్పటికీ కోరుకుంటారు. అందుకే బఫెట్ అలా జీవిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఒక మాటంటారు… డబ్బు మనిషిని సృష్టించలేదు, మనిషే డబ్బును సృష్టించాడని అంటారు. అవును మరి, ఆ సత్యం తెలియకే కదా, జనాలు నేడు సతమతమవుతున్నారు..!