నమస్కారాన్ని రెండు రకాలుగా పెడతారు. కేవలం చేతులు జోడించి ఎదుటి వ్యక్తిని చూస్తూ నమస్కరించడం. మరొకటి.. రెండు చేతులూ జోడించి.. తలవంచి గౌరవప్రదంగా నమస్కరించే విధానం. నమస్కార్ అనే పదం నమః అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. నమః అంటే.. వందనం లేదా నమస్కారం అని అర్థం. హిందూయిజం ప్రకారం మానవ శరీరం నీళ్లు, అగ్ని, భూమి, గాలి, శూన్యం నుంచి రూపొందిందని చెబుతుంది. ఈ విశ్వంలో అతి సూక్ష్మమైన కిరణాలు ప్రసరించేదిగా మానవ శరీరాన్ని భావిస్తారు. కాబట్టి రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల శరీరంలోకి ఎనర్జీ ప్రసరిస్తుందని నమ్మకం ఉంది. రెండు చేతులూ జోడించి పెట్టే నమస్కారం.. ఎదుటివ్యక్తి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. అహంకారాన్ని విడిచి అవతలవ్యక్తిపై సహృదయతను నమస్కారం వివరిస్తుంది. చేతులు జోడించి నమస్కరించడం హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది. ఈ పద్ధతిని బౌద్ధ, జైన మతాలు కూడా ఆచరించాయి.
నమస్కరించడానికి రెండు అర చేతులనూ దగ్గరికి చేరుస్తాం. అలా చేర్చడం వల్ల వేళ్ల చివర, అరచేతిలో ఉండే శక్తి కేంద్రకాలు ఉత్తేజితమౌతాయి. దాని వల్ల ఎదురుగా ఉన్న వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుంటారు. నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు. అంటే కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి నమస్కారం చేస్తాం. అంటే మాటలతో అవసరం లేకుండా.. ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం. నమస్కారమనేది ఆరోగ్యకరమైన అలవాటని మీకు తెలుసా ? కరచాలనం చేయడం వల్ల ఒకరి చేతి క్రిములు మరొకరికి అంటుకునే అవకాశం ఉంది. అదే నమస్కారం చేస్తే వల్ల అలాంటి అవకాశాలు లేవు. అందుకే నమస్కారం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా చెప్పవచ్చు.
నమస్కారం పెట్టే సమయంలో మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతోంది. అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారని సూచిస్తుంది. అలా అవతలి వ్యక్తిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు. మనం నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది.