Cinema : మరికొద్ది రోజుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణలో టిక్కెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోకు ఎదురు దెబ్బ తగిలింది. బుక్ మై షో యాప్‌లో సినిమా టిక్కెట్లను విక్రయించకూడదని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. దీంతో బుక్ మై షో యాప్ కు గట్టి షాకే తగిలిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇకపై ఈ యాప్‌లో కాకుండా సినిమా టిక్కెట్లను థియేటర్ల వద్దే కౌంటర్లలో విక్రయించనున్నారు.
అయితే బుక్ మై షో యాప్ కు డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇవ్వడం వెనుక బలమైన కారణమే ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు, మల్టీ ప్టెక్స్‌లలో సినిమా రిలీజ్ అయిన సమయంలో టిక్కెట్ల ధరలను పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది. దీంతో మల్టీ ప్లెక్స్‌లలో టిక్కెట్ ధర గరిష్టంగా రూ.300 అవుతోంది. దీన్ని బుక్ మై షో యాప్ లో బుక్ చేస్తే అదనంగా మరో రూ.30 లను కమిషన్ కింద ప్రేక్షకులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో టిక్కెట్ ధర ఇంకా పెరుగుతోంది. అయితే అసలే ప్రేక్షకులు రాక ఇబ్బందులు పడుతున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు ఇలా టిక్కెట్ ధర పెరిగితే ప్రేక్షకులు రాకపోవచ్చని ఆందోళన చెందారు. అందువల్లే బుక్ మై షో యాప్ కు టిక్కెట్లను విక్రయించే అనుమతిని తొలగించారు. ఇకపై కౌంటర్ల వద్దే టిక్కెట్లను విక్రయిస్తారు.
అయితే ఇలా కౌంటర్ ల వద్ద టిక్కెట్లను విక్రయిస్తే ప్రేక్షకులకు ఇబ్బందులు ఎదురవుతాయని.. వారు అంత దూరం వెళ్లి టిక్కెట్‌లను కొనుగోలు చేసి మరీ సినిమాలను చూడరని.. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో చాలా మంది సినిమా టిక్కెట్లను ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారని.. కనుక డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సరైంది కాదని కొందరు అంటున్నారు. అయితే కొద్ది రోజుల పాటు మాత్రం బుక్ మై షో యాప్ లో టిక్కెట్లను విక్రయించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో బుక్ మై షో యాప్ వారు దిగివచ్చి ఆ కమిషన్‌ను తగ్గిస్తారా.. లేదా.. చూడాలి.