Triphala Churnam : ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం వాత, కఫ, పిత్త దోషాలను కలిగి ఉంటుంది. కొందరిలో వాత ప్రధానమైన జబ్బులు, కొందరిలో పిత్త ప్రధానమైన జబ్బులు, కొందరిలో కఫ ప్రధానమైన జబ్బులు వస్తూ ఉంటాయి. ఆయా జబ్బులకు అనుగుణంగా మందులను వాడుతూ ఉంటారు. కానీ అన్ని రకాల జబ్బులను నివారించే ఔషధం త్రిఫల చూర్ణం. దీనిని వాడడం వల్ల మన శరీరంలోని అన్ని రకాల దోషాలు తగ్గుతాయి. వాతం నాడీ వ్యవప్థకు, పిత్తం జీవ క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినవి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణంలో ఉండే ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మనకు వచ్చే పిత్త దోషాలను నివారించడంలో ఉసిరి కాయ ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణంలో ఉండే ఉసిరి కాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. విరోచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ప్రేగులలో ఉండే మలినాలను తొలగిస్తుంది.

త్రిఫల చూర్ణంలో ఉండే మరొక ఫలం తాని కాయ. ఇది వగరు రుచిని కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. తానికాయ మన శరీరంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మంపై వచ్చే అలర్జీలను తగ్గించడంలో తాని కాయ ఉపయోగపడుతుంది. శ్వాస కోస సంబంధమైన సమస్యలను నివారించడంలో తాని కాయ ఎంతో సహాయపడుతుంది. త్రిఫలలో ఉండే ఇంకొక ఫలం కరక్కాయ. కరక్కాయను ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో త్రిఫల చూర్ణం ఎంతో సహాయపడుతుంది.
త్రిఫల చూర్ణంలో కరక్కాయ ఒక వంతు, తాని కాయలు రెండు వంతులు, ఉసిరి కాయలు నాలుగు వంతులుగా ఉంటాయి. త్రిఫల చూర్ణాన్ని వాడడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. స్త్రీలలో వచ్చే అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. మల బద్దకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. కఫ, పైత్య దోషాలన్నీ తగ్గుతాయి. మధుమేహం, ఊబకాయంతో బాధపడే వారికి త్రిఫల చూర్ణం దివ్య ఔషధంలా పని చేస్తుంది. నెయ్యితో కానీ, తేనెతో కానీ, పంచదారతో కానీ లేదా బెల్లం, నూనెను సమపాళ్లలో కలిపి కానీ త్రిఫల చూర్ణాన్ని ఉదయం పూట తీసుకోవడం వల్ల సమస్త రోగాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
శరీరతత్వాన్ని బట్టి త్రిఫల చూర్ణాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. వేడి శరీరం ఉన్న వారు త్రిఫల చూర్ణాన్ని మజ్జిగతో కలిపి తాగాలి. మలబద్దకం ఉన్నవారు రాత్రిపూట గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి తాగడం వల్ల మలబద్దకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. మగవారిలో శీఘ్ర స్కలనం సమస్య తగ్గుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మూత్రాశయ సంబంధమైన సమస్యలు కూడా తగ్గుతాయి.