business ideas

కారంపొడి త‌యారుచేసి ప్యాకెట్ల‌లో విక్ర‌యించే బిజినెస్‌.. చక్క‌ని ఆదాయ మార్గం..!

ఎంతో పురాత‌న కాలం నుంచి భార‌తీయు వంటిళ్ల‌లో కారం అనేది ఒక ముఖ్య‌మైన ప‌దార్థంగా మారింది. కారం లేనిదే మ‌న‌కు ఏ కూరా పూర్తి కాదు. ఇక మ‌న దేశంలో చాలా మంది కారంను కోరుకునే వారుంటారు. అందువ‌ల్ల మ‌నం నిత్యం చేసుకునే కూరల్లో ఎండు మిర‌ప‌కాయ‌ల కారాన్ని క‌చ్చితంగా వేస్తుంటాం. అయితే.. కొద్దిగా శ్ర‌మించి.. పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉండాలేగానీ.. నిజానికి ఈ కారం పొడి త‌యారు చేసి అమ్మితే.. చాలా లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌రి ఇందుకు పెట్టుబడి ఎంత అవ‌స‌రం అవుతుందో, ఏ మేర సంపాద‌న వ‌స్తుందో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

కారం పొడి త‌యారీ బిజినెస్‌ను స్థలం ఉంటే ఇంట్లోనే చేయ‌వ‌చ్చు. లేదా ష‌ట‌ర్ల‌ను, గ‌దుల‌ను అద్దెకు తీసుకుని కూడా చేయ‌వ‌చ్చు. ఇందుకు లోక‌ల్ అథారిటీ ప‌ర్మిష‌న్ కావాలి. అలాగే ఎంఎస్ఎంఈ స్కీం కింద రిజిస్ట‌ర్ చేసుకోవాలి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా మ‌నం పెట్టే బిజినెస్‌కు అయ్యే ఖ‌ర్చులో కొంత వ‌ర‌కు స‌బ్సిడీని పొంద‌వ‌చ్చు. అలాగే ఈ బిజినెస్‌కు జీఎస్‌టీ రిజిస్ట్రేష‌న్ కూడా చేయించాలి.

ఇక కారం పొడి త‌యారీ బిజినెస్ పెట్టేందుకు దాదాపుగా రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. అవ‌స‌రం అనుకుంటే ఇద్ద‌రు వ‌ర్క‌ర్ల‌ను పెట్టుకోవ‌చ్చు. ఇక ఈ బిజినెస్‌కు ఎండు మిర‌ప‌కాయ‌లు అవ‌స‌రం అవుతాయి. వాటిని మార్కెట్‌లో నేరుగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్వాలిటీ క‌లిగిన ఎండు మిరప కాయ‌ల‌ను చూసి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా.. పండు మిర‌ప‌కాయ‌ల‌ను కొని, వాటిని బాగా క‌డిగి, ఎండ‌లో ఎండ‌బెట్టి.. ఎండు మిర‌ప‌కాయ‌లుగా మార్చుకోవ‌చ్చు. ఇక ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను గ్రైండ్ చేసేందుకు గాను గ్రైండింగ్ మెషిన్ అవ‌స‌రం అవుతుంది. దీని ధ‌ర దాదాపుగా రూ.35వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఎండు మిర‌ప‌కాయ‌ల‌ను గ్రైండ్ చేశాక కారం పొడి వ‌స్తుంది. దాన్ని చ‌ల్లార‌నివ్వాలి. ఇక ఆ పొడి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు అందులో కొద్దిగా ఉప్పు క‌ల‌ప‌వ‌చ్చు.

chilli powder making business you can earn good income

అలా సిద్ధం చేసుకున్న కారం పొడిని ప్యాకింగ్ మెషిన్ ద్వారా 200 గ్రాముల ప్యాకెట్ల‌లో ప్యాక్ చేయాలి. ఇందుకు గాను ప్యాకింగ్ మెషిన్ కావ‌ల్సి ఉంటుంది. దాని ఖ‌రీదు రూ.40వేల వ‌ర‌కు ఉంటుంది. ఈ క్ర‌మంలో నిత్యం సుమారుగా 200 వ‌ర‌కు అలాంటి ప్యాకెట్ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇక ఒక్కో 200 గ్రాముల కారం పొడి ప్యాకెట్ ఖ‌రీదు సుమారుగా రూ.53 వ‌ర‌కు ఉంటుంది. ఈ క్ర‌మంలో నిత్యం 200 కారంపొడి ప్యాకెట్లు త‌యారు చేయ‌గ‌లిగితే.. 200 * 53 = రూ.10,600 రోజుకు వ‌స్తుంది. అదే నెల‌కు అయితే 30 * 10,600 = రూ.3,18,000 వ‌స్తుంది. ఇందులో మ‌న‌కు ఎంత లేద‌న్నా క‌నీసం 40 శాతం వ‌ర‌కు మార్జిన్ ఉంటుంది. అంటే.. రూ.3.18 ల‌క్ష‌ల‌లో 40 శాతం మార్జిన్ = రూ.1,27,200 అవుతుంది. ఈ మొత్తం మ‌న‌కు లాభం రూపంలో వ‌స్తుంది. ఆ క‌ట్ అయిన మొత్తం మ‌న‌కు కారం పొడి ప్యాకెట్ల‌ను త‌యారు చేసేందుకు అయ్యే ఖ‌ర్చ‌న్న‌మాట‌. ఇలా నెల‌కు రూ.1,27,200 వ‌ర‌కు ఈ బిజినెస్‌లో సంపాదించ‌వ‌చ్చు.

అయితే పైన వేసిన లెక్క కేవ‌లం ఉజ్జాయింపు మాత్ర‌మే. అంత‌కు త‌క్కువ‌గా ప్యాకెట్ల‌ను త‌యారు చేస్తే.. లాభం ఆ మేర రాదు. అదే అంత‌కు మించి ప్యాకెట్ల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తే.. అంత‌క‌న్నా ఎక్కువగానే లాభం ఉంటుంది. అంటే.. ఈ బిజినెస్‌ను ఎవ‌రు చేసినా స‌రే.. వారి సామ‌ర్థ్యం మేర లాభాలు వ‌స్తాయ‌న్న‌మాట‌. అందుకుగాను మార్కెటింగ్ కూడా అవ‌స‌ర‌మే. సూప‌ర్ మార్కెట్లు, కిరాణా షాపులు, హోట‌ల్స్‌, రెస్టారెంట్లు, క్యాంటీన్లు త‌దిత‌ర వ్యాపారుల‌తో టై అప్ అయితే ఈ బిజినెస్ చ‌క్క‌గా వృద్ధి చెందుతుంది. దీంతో పైన చెప్పిన దాని క‌న్నా ఎక్కువ మొత్తంలో లాభాల‌ను పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకు బాగా మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క‌టీ శ్ర‌మ అనుకోకుండా చేస్తే.. కారం పొడి ప్యాకెట్ల త‌యారీ బిజినెస్‌లో ఎవ‌రైనా చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు..!

Admin

Recent Posts