ప్రస్తుతం మనకు స్వయం ఉపాధి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కొన్నింటికి పెట్టుబడి పెద్ద ఎత్తున అవసరం అవుతుంది. కొన్నింటికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఒక మోస్తరు పెట్టుబడితో.. కొద్దిగా కష్టపడి చేసే అనేక వ్యాపారాలు కూడా ఉన్నాయి. వాటిల్లో గన్నీ బ్యాగ్స్ బిజినెస్ కూడా ఒకటి. వీటినే తెలుగు రాష్ట్రాల్లో గోనె సంచులు కూడా అంటారు. వీటి బిజినెస్ చేయాలంటే.. అందుకు ఏమేం అవసరమో.. ఎంత పెట్టుబడి పెట్టాలో.. ఎంత వరకు ఆదాయం సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా రైతులు పండించే వరి, గోధుమ తదితర అనేక ధాన్యాలు మొదలుకొని పప్పు గింజలు, ఇతర ఆహార పంటల వరకు.. ధాన్యాలను మొత్తం గన్నీ బ్యాగులలోనే రవాణా చేస్తుంటారు. రైతుల వద్ద వ్యాపారులు వాటిని కొని గన్నీ బ్యాగులలో నింపి పరిశ్రమలకు, స్టోరేజ్‌లకు తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లలో పెద్ద ఎత్తున ఆయా ధాన్యాలు, పప్పు గింజలు, ఇతర ఆహార పంటల విక్రయాలు జరుగుతుంటాయి. అయితే ఆయా మార్కెట్లలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యాపారులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే.. గన్నీ బ్యాగుల బిజినెస్ చేయవచ్చు.
సాధారణంగా గన్నీ బ్యాగులను జూట్ మిల్స్‌లో తయారు చేస్తారు. ఇవి అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో ఆ సంచులను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి మార్కెట్లలో ఒక్కో సంచిని రూ.45 వరకు విక్రయించవచ్చు. మార్కెట్‌లో రైతులకు ఇవి పెద్ద ఎత్తున అవసరం అవుతుంటాయి. అయితే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి.. ఈ సంచులను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి విక్రయిస్తే.. నెల నెలా రూ. లక్షల నుంచి రూ.కోట్లలో ఆదాయం సంపాదించవచ్చు.
ఇక గన్నీ బ్యాగులను కొనుగోలు చేశాక వాటిని స్టోర్ చేసేందుకు గోదాములను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పంట ఉత్పత్తులు అయ్యే మార్కెట్లలో విజిటింగ్ కార్డులు, పాంప్లెట్లతో పబ్లిసిటీ చేయాలి. దీంతోపాటు రైతులు, అధికారులు, వ్యాపారులతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో గన్నీ బ్యాగుల బిజినెస్ సక్సెస్ అవుతుంది. దీంట్లో నష్టాలు వచ్చే అవకాశం దాదాపుగా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే.. ఈ వ్యాపారాన్ని చక్కని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. దీంట్లో వెచ్చించే పెట్టుబడిని బట్టి ఎవరికైనా లాభాలు వస్తాయి. పంట ఉత్పత్తులు ఎక్కువగా విక్రయాలు జరిగే మార్కెట్లలో పెద్ద ఎత్తున గోనె సంచులు అవసరం అవుతాయి కనుక.. ఆ మార్కెట్లపై దృష్టి సారిస్తే నెల నెలా రూ. లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు.