Gold : బంగారం అంటే సహజంగానే చాలా మందికి ఇష్టమే. బంగారు ఆభరణాలను ధరించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కేవలం మహిళలే కాదు.. పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మన దేశంలో వాస్తవానికి బంగారం ధర చాలా ఎక్కువ. బంగారాన్ని కడ్డీలు, బార్‌ల రూపంలో కొంటే మేకింగ్ చార్జిలు ఉండవు. కానీ ఆభరణాలను కొంటే మేకింగ్ చార్జిలను విధిస్తారు. ఈ క్రమంలోనే దుబాయ్‌కి వెళ్లేవారు బంగారు ఆభరణాలను కొని తెస్తుంటారు.
అయితే దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడే వాళ్ల గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉంటాం. కానీ వాస్తవానికి అసలు దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవచ్చు. అసలు బంగారం అక్కడ ఎందుకు తక్కువ ధరను కలిగి ఉంటుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్‌లో ఆదాయపు పన్ను మాత్రమే కాదు, ఇతర ఏ పన్నులు కూడా ఉండవు. అందుకనే అక్కడ అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగా సాగుతుంటాయి. ఇక వాటిల్లో బంగారం వ్యాపారం కూడా ఒకటి. అక్కడ అమ్మే బంగారం చాలా క్వాలిటీగా ఉంటుందని పేరుంది. దీనికి తోడు అక్కడ బంగారం రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. కొన్ని లక్షల కోట్ల వ్యాపారం సాగుతుంది. కనుకనే బంగారంపై అక్కడ పన్ను లేదు. కాబట్టే అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.
ఇక భారత్ తో పోలిస్తే దుబాయ్‌లో కనీసం 14 నుంచి 20 శాతం మేర బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. కనుకనే కొందరు అక్కడ బంగారం కొని అక్రమ మార్గంలో ఇండియాకు తరలిస్తుంటారు. ఆ క్రమంలో కొందరు పట్టుబడుతుంటారు కూడా. అయితే మన దేశం వారు ఎవరైనా సరే పురుషులు అయితే 20 గ్రాముల బంగారం, స్త్రీలు అయితే 40 గ్రాముల బంగారాన్ని దుబాయ్‌లో కొని తేవచ్చు. అంతకన్నా ఎక్కువ తెస్తే మాత్రం.. 12.5 శాతం వరకు పన్ను చెల్లించాలి. ఈ పన్ను చెల్లించాలని చెప్పే కొందరు బంగారాన్ని దుబాయ్ నుంచి ఇండియాకు స్మగ్లింగ్ చేస్తారు.
అయితే పురుషులు 20 గ్రాములు, స్త్రీలు 40 గ్రాముల కన్నా ఎక్కువ బంగారం కొని తెస్తే మాత్రం.. ఎక్కువగా ఉన్నా బంగారానికి పన్ను చెల్లించి తీసుకెళ్లవచ్చు. అయితే ఇలా పన్ను చెల్లించి తీసుకెళ్లే బంగారంపై లిమిట్ ఏమీ లేదు. ఎంతైనా కొని తేవచ్చు. కానీ పన్ను అయితే తప్పక చెల్లించాలి. లేదంటే స్మగ్లింగ్ చేసినట్లు అవుతుంది.