పిల్లాడికి దిష్టి తగిలినట్టుంది. ఒకటే వాంతులవుతున్నాయి. ఉదయం నుండి ఏమీ తినలేదు. కడుపు ఉబ్బరంగా ఉందంట… కాస్త దిష్టి మంత్రం వేయ్యి పెద్దమ్మా..అంటూ ఇప్పటికీ ఊర్లల్లో చాలా మంది దిష్టి మంత్రం వచ్చిన వారి దగ్గరికి వెళతారు.అప్పుడు వారు ..చేతిలోకి కొంత పంచదారో..ఉప్పో తీసుకొని…లోలోపల మంత్రాలు చదివి. త్పూ…త్పూ…థూ…అంటూ ఉమ్మినట్టు చేసి వారి చేతికిచ్చి..మీ అబ్బాయికిచ్చి తినమని చెప్పండి. దిష్టి తగ్గిపోతోంది అంటారు. అమ్మ వచ్చి అలా చేయగానే…ఆ కుర్రాడికి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. కుర్రాడు కాసింత తేరుకోగానే..దిష్టిమంత్రం పనిచేసిందని తెగ ఆనందపడిపోతుంది అమ్మ….అయితే ఇప్పుడు దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
దిష్టి తగిలింది అనే వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే..కడుపు ఉబ్బరంగా మారడం. అజీర్తి వల్ల కడుపు నొప్పి రావడం. దీనికి కారణం..జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడమో? లేక నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడమో . వీటి వల్ల కడుపులో నొప్పి వస్తుంది. దానినే మనవాళ్లు దిష్టి తగిలింది అంటారు. ఇప్పుడు మంత్రం విషయానికి వద్దాం… థూ…థూ ..థూ అని మంత్రసాని మన చేతికిచ్చేది….. పంచదార/ ఉప్పు… వీటిని సదరు వ్యక్తి తినేటప్పుడు…అతడిలోని లాలాజల గ్రంధులు అధిక లాలాజలాన్ని స్రవిస్తాయి. అధిక లాలాజలం కడుపులో పడి ఉన్న ఆహారం పై రెట్టింపు చర్య జరిపి దానిని జీర్ణమయ్యేలా చేస్తుంది. అందుకే కడుపు ఫ్రీ అవుతుంది.
మంత్రం చదవకుండా…ఇచ్చినప్పటికి పంచదార/ఉప్పులకు ఆ శక్తి ఉంటుంది. ఆ స్థానంలో చింతపండు/ నిమ్మకాయలు అయితే ఇంకా ఎక్కువగా పనిచేస్తాయి. ఈ సారి దిష్టి తగిలిందనే ఫీలింగ్ లో ఉంటే ఓ గ్లాస్ నిమ్మరసం లో ఉప్పు పంచదార కలిపి తాగండి. కడుపు దెబ్బకు ఫ్రీ అవుతుంది. భారతీయులకు నమ్మకాల పట్ల అధిక విశ్వాసం ఉండడం చేత సైన్స్ ను నమ్మకాలతో మిళితం చేసిన వైద్యాలు మన దేశంలో అనేకం ఉంటాయి. మన ప్రతి ఆచార సాంప్రదాయాలో సైన్స్ దాగి ఉంటుంది. దానిని పట్టుకోగలిగితే..వైద్య శాస్త్రంలో అద్భుతాలు సృష్టించవచ్చు.