హిందువుల్లో చాలా మంది ఇష్టపూర్వకంగా ఆరాధించే దేవుళ్లలో ఆంజనేయ స్వామి కూడా ఒకరు. ఆయనకు ఎంత శక్తి ఉంటుందో ఆయనను పూజించే భక్తులకు, ఆ మాట కొస్తే దాదాపుగా అందరికీ ఆ విషయం తెలుసు. క్షుద్ర శక్తుల బారి నుంచి రక్షించే పవర్‌ఫుల్ గాడ్‌గా హనుమంతున్ని అందరూ కొలుస్తారు. ఆయనను పూజిస్తే ఎంతో ధైర్యం, శక్తి వస్తాయని కూడా చాలా మంది నమ్ముతారు. అయితే మీకు తెలుసా..? ఆంజనేయ స్వామిని చిరంజీవి అని పిలుస్తారని..? ఎందుకంటే ఆయనకు మరణం లేదు కాబట్టి ఆయన్ను చిరంజీవి అని అంటారు. ఇంతకీ హనుమకు ఆ పేరు ఎలా వచ్చిందో, ఏ సందర్భంలో వచ్చిందో తెలుసా..?
హనుమంతుడు చిన్న పిల్లాడిగా ఉన్న సమయంలో ఒక రోజు అతనికి బాగా ఆకలి వేస్తుంది. దీంతో ఆకాశంలోకి చూడగానే అక్కడ ఎరుపు రంగులో ఉన్న సూర్యుడు కనిపిస్తాడు. దీంతో సూర్యున్ని చూసి పండు అనుకున్న హనుమ సూర్యుని దగ్గరికి వెళ్లి అతన్ని మింగుతాడు. దీంతో లోకమంత చీకటిమయమవుతుంది. అయితే సూర్యుని కిరణాలు, భరించలేని వేడి, ఉష్ణోగ్రతలు కూడా హనుమను ఏమీ చేయలేకపోతాయి. ఈ క్రమంలో దేవుళ్లంతా శివుడి వద్దకు వెళ్లి మొర పెట్టుకోగా, అప్పుడు శివుడు దేవేంద్రున్ని పంపిస్తాడు. దీంతో ఇంద్రుడు తన వజ్రాయుధం విసిరి హనుమను తీవ్రంగా గాయపరుస్తాడు. ఈ క్రమంలో హనుమ గాయపడగానే అతని నోటి నుంచి సూర్యుడు మళ్లీ బయటికి వస్తాడు. లోకానికి వెలుగు వస్తుంది.
అయితే హనుమకు గాయాలవడం చూసిన అతని తండ్రి వాయు దేవుడు హనుమను తీసుకుని పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. దీంతో భూమిపై వాయువు (గాలి) క్షీణిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో భూమిపై ఉన్న జీవాలన్నీ గాలి అందక చనిపోతుంటాయి. దీన్ని గమనించిన బ్రహ్మ వాయుదేవున్ని తిరిగి భూమిపైకి రావాలని అడుగుతాడు. అయితే తన పుత్రుడు హనుమకు గాయాలయ్యాయని, తాను రాలేనని వాయు దేవుడు చెప్తాడు. దీంతో బ్రహ్మ తన శక్తితో హనుమను మళ్లీ మామూలుగా అయ్యేలా చేస్తాడు. అప్పుడే బ్రహ్మ హనుమంతుడికి ఓ వరం ఇస్తాడు. ఇకపై ఎలాంటి ఆయుధం కూడా హనుమను ఏమీ చేయదని, అతను ఎప్పటికీ చిరంజీవిలా ఉంటాడని బ్రహ్మ వరం ఇస్తాడు. అనంతరం ఇంద్రుడు ఏమంటాడంటే, తన వజ్రాయుధం వెళ్లి ఆంజనేయ స్వామి హను (బుగ్గ)కి తాకినందు వల్ల ఇకపై ఆంజనేయుడ్ని హనుమంతుడు అని కూడా పిలుస్తారని అంటాడు. దాంతో అప్పటి నుంచి ఆంజనేయుడ్ని హనుమంతుడు అంటున్నారు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఆంజనేయుడు మృత్యుంజయుడు, చిరంజీవి అయ్యాడు.