Crow : కాకి గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఇంటి బయట నిలబడితే చాలా కాకులు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే కాకిని కాలజ్ఞాని అని కూడా పిలుస్తారు. చాలామందికి ఎందుకు అలా పిలుస్తారు అనే విషయం కూడా తెలియదు. కాకి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. కాకులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అందరినీ నిద్ర లేపుతూ ఉంటాయి. కాకులన్నీ కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి. ఏ కాకి అయినా ఆహారం దొరికితే మిగిలిన వాటితో పంచుకుంటూ ఉంటుంది.
కాకులు సూర్యాస్తమయం తర్వాత అసలు ఆహారాన్ని తీసుకోవు. హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే కాకులకి చాలా ప్రాధాన్యత ఉంది. శని దేవుడి వాహనం కాకి. అందుకనే కాకిని పూజిస్తూ ఉంటారు. రావణుడికి భయపడి కాకిరూపాన్ని ధరించిన యముడు కాకులకి పెద్ద వరాన్ని ఇచ్చాడు. అందరి ప్రాణాలని యముడు తీసేవాడు కాబట్టి స్వయంగా కాకిరూపాన్ని ఆయన ధరించడం వలన ఆనాటి నుండి కాకులకి సాధారణ రోగాలు ఏవీ కూడా రావు.
కాకులు చిరాయువులయి ఉంటాయని వరం ఇచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలు భరిస్తున్న వాళ్ళ బంధువులు కాకికి పిండం పెడితే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందని అంటారు. పితృ కర్మల విషయంలో ఇప్పటికి కూడా కాకులకి పిండాలని పెడుతున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు రావడానికి ముందు కాకులు సూచనలు ఇస్తూ ఎగురుతూ ఉంటాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కూడా కాకులు గూటికి చేరి గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేస్తాయట. అందుకే కాకిని కాలజ్ఞాని అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాకుల గురించి చాలా వుంది.