Lord Vishnu : లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు 10 అవతారాలను ధరించాడు. అందులో కొన్ని అవతారాలతో జనావళికి మేలు చేయగా, మరికొన్ని అవతారాల్లో రాక్షస సంహారం చేసి జనాలను, దేవతలను రక్షించాడు. ఈ క్రమంలో ఆయన ధరించిన ఒక్కో అవతారం గురించి అనేక కథలు కూడా ఉన్నాయి. పురాణాల్లో వీటి గురించి వివరంగా తెలియజేశారు కూడా. అయితే శ్రీమహావిష్ణువు ఆయన ధరించిన అవతారాల్లోనే కాదు, అనేక ఇతర వేరే పేర్లతో కూడా భక్తులచే పొగడ్తలు, కీర్తనలు, ప్రశంసలు అందుకుంటున్నాడు. అందులో ఒక పేరే నారాయణుడు. ఇంతకీ ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ప్రాణికోటి మనుగడకు నీరు అత్యంత ఆవశ్యకం. నీరు లేకపోతే మనం లేము. అయితే నారాయణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఆయణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే సమస్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు కనుకనే విష్ణువుకు నారాయణుడనే పేరు వచ్చింది. అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భవించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయన్ను నారాయణుడని పిలుస్తారు.
అయితే పైన చెప్పినవే కాకుండా విష్ణువును నారాయణుడని పిలవడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. నారదుడు ఎల్లప్పుడూ నారాయణ.. నారాయణ.. అంటూ స్మరణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయణుడని పిలవడం మొదలుపెట్టారట. అదేవిధంగా గంగానది విష్ణువు పాదాల నుంచి ఉద్భవించడం వల్ల విష్ణు పాదోదకం అని పేరు వచ్చిందట. దీంతోపాటు విష్ణువు ఎల్లప్పుడూ నీటిలో నివసిస్తాడు కాబట్టి ఆయనకు నారాయణుడనే పేరు వచ్చింది. ఇవీ ఆ పేరు వెనుక ఉన్న రహస్యాలు.