మన దేశంలో ఉన్న ఒక్కో పురాతనమైన ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. ఆయా ఆలయాలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నట్టే అక్కడ ఆచరించే పలు పద్ధతులు, సాంప్రదాయాలు కూడా ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. అదిగో… రాజస్థాన్‌లోని ఆ ఆలయంలో కూడా అలాంటి విచిత్రమైన పద్ధతులే పాటిస్తారు. అవును మరి, ఎందుకంటే ఆ ఆలయంలో పూజింపబడేది దేవత మాత్రమే కాదు, ఎలుకలు కూడా. ఏంటీ షాక్ తిన్నారా..? అయినా మేం చెబుతోంది నిజమే. అక్కడ కొలువై ఉన్న దేవతతోపాటు స్థానికులు, భక్తులు ఆ ఆలయంలో ఉన్న ఎలుకలను కూడా పూజిస్తారు. వాటి పాద స్పర్శ తగిలితే అంతా మంచిదని నమ్ముతారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? రాజస్థాన్‌లో..!
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో డెష్నోక్ అనే ఓ చిన్న గ్రామం ఉంది. చుట్టు పక్కల ఉన్న 10 గ్రామాల మూలల నుంచి ఈ గ్రామం ఏర్పడింది. అందుకే దీన్ని దస్ నోక్ (పది మూలలు) అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం బికనీర్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ కు సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అక్కడే పైన చెప్పిన ఆ ఆలయం ఉంది. దాని పేరు కర్ణిమాత ఆలయం. అక్కడ కొలువై ఉన్న దేవత దుర్గాదేవి. అయితే ఆ ఆలయం ఏలా నిర్మించబడిందంటే… ఒకప్పుడు రావు బికాజీ అనే ఓ వ్యక్తికి దుర్గా మాతకు అనుగ్రహం లభిస్తుందట. దీంతో అతను ఆ దేవతను కొలుస్తూ అక్కడ ఆమెకు ఓ ఆలయం నిర్మించాడట. ఈ క్రమంలో 20వ శతాబ్దంలో అదే వంశానికి చెందిన రాజు గంగా సింగ్ ఆ ఆలయాన్ని నవీకరించారు. దీంతో ఆ ఆలయం గురించి ఒక్క సారిగా బయటి ప్రపంచానికి తెలిసింది.
అయితే డెష్నోక్ ఆలయంలో కేవలం దుర్గామాతనే కాదు, అక్కడ ఉండే ఎలుకలను కూడా భక్తులు పూజిస్తారట. ఎందుకంటే వాటిని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, వాటి పాదాల స్పర్శ తగిలితే అంతా మంచే జరుగుతుందని వారి విశ్వాసం. ఈ క్రమంలో కర్ణిమాత ఆలయంలో భక్తులు ఎలుకలకు పాలు, పండ్లు, ప్రసాదం వంటివి తినిపిస్తారు. అలా చేసినా శుభం కలుగుతుందని వారు నమ్ముతారు. అయితే ఈ మధ్య కాలంలో కర్ణిమాత ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో ఏటా అక్కడ రెండు సార్లు జాతర నిర్వహిస్తున్నారు. మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జాతర జరుగుతుంది. ఈ జాతరకు వేలాది భక్తులు వస్తారు.
అంతేకాకుండా కర్ణిమాత ఆలయంలో గంగౌర్ పండుగను నిర్వహిస్తారు. దీనికి కూడా భక్తులు పోటెత్తుతారు. ఆ రోజున మహిళలు అమ్మవారికి పూజ చేసి తమ వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అంతటి విశేషం ఉన్న ఆలయాన్ని మీరూ సందర్శించవచ్చు. ఎలాగంటే.. విమానమైతే జోధ్ పూర్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి డెష్నోక్‌కు టాక్సీలో వెళ్లవచ్చు. అదే ట్రైన్ అయితే జోధ్ పూర్‌లో స్టేషన్ ఉంది. అక్కడికి అన్ని నగరాల నుంచి ట్రెయిన్స్ వెళ్తాయి. రోడ్డు మార్గమైతే బికనీర్‌కు చేరుకుని అక్కడి నుంచి క్యాబ్ ద్వారా డెష్నోక్ కు వెళ్లవచ్చు..!