శబరిమల అయ్యప్ప స్వామి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది 18 మెట్లు. దీన్నే పదునెట్టాంబడి అంటారు. అయ్యప్ప దీక్ష చేపట్టింది మొదలు ఇరుముడి దేవుడికి సమర్పించే వరకు చేసే ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధ భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాలి. శబరిమల సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తున్నాయని, అవి అయ్యప్ప దుష్ట శక్తులను సంహరించడానికి ఉపయోగించిన 18 ఆయుధాలని అంటారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలను తరువాతి 8 మెట్లు రాగ ద్వేషాలను సూచిస్తాయి. తదుపరి 3 మెట్లు సత్వ, తమో, రజో గుణాలకు ప్రతీక. 17, 18 మెట్లు విద్య, అజ్ఞానాన్ని సూచిస్తాయి.
ఈ 18 మెట్లను ఒకమారు ఎక్కడానికి, మరోమారు దిగడానికి ఉపయోగిస్తారు. 40 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కువతారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మోగించారని కథనం. సన్నిధానంలో పానపట్టంపైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనం ఇస్తాడు.
ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని చెబుతారు. అష్ట దిక్పాలకులు 8 మంది 2 యోగములు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానానికి రూపాలుగా ఈ 18 మెట్లను ఏర్పాటు చేశారు. సన్నిధానంలో చేరిన భక్తులు 18 మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి నెయ్యితో స్వామి వారికి అభిషేకం చేస్తారు. తరువాత మాలికాపు రత్తమ్మ అమ్మవారి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కొబ్బరి కాయలు దొర్లించి పసుపు, జాకెట్ ముక్కలను ఆమెకు మొక్కు బడిగా చెల్లించుకుంటారు. ప్రతి ఏటా నవంబర్ మధ్య నుంచి సంక్రాంతి వరకు శబరిమలై భక్తకోటితో పులకిస్తుంది.