ఆంజనేయ స్వామికి మంగళ, శని వారాల్లో పూజలు చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను నేరుగా పూజించవచ్చు. లేదా రామున్ని పూజించవచ్చు. దీంతో ఆంజనేయ స్వామి భక్తులను ఆశీర్వదిస్తాడు. మంగళవారం రోజు ఆయనకు వెన్నతో అభిషేకం చేస్తే అంతా శుభమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
రామనామం వినిపించే ప్రతి చోట హనుమ ఉంటాడని, అందుకని ఆయనను ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు ముందుగా శ్రీరాముడి భక్తులై ఉండాలని పండితులు చెబుతుంటారు. హనుమను పూజిస్తే ఆయన మురిసిపోతాడు. అదే రాముడికి పూజలు చేస్తే హనుమ పరవశించిపోతాడని చెబుతారు. అందుకే రాముడిని హనుమతో కలిపి పూజలు చేస్తే విశేష ఫలితం దక్కుతుంది. ఇక హనుమకు మంగళ, శనివారాల్లో పూజలు చేస్తారు కాబట్టి అవే రోజుల్లో ఆయనకు వెన్నతో అభిషేకం చేయాలి.
మంగళవారం రోజు హనుమను వెన్నతో అభిషేకించాక ఆయనకు ప్రదక్షిణలు చేయాలి. సింధూర అభిషేకం ఆకు పూజ చేయించాలి. వడలు, తీపి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. మంగళ, శనివారాల్లో ‘సుందరకాండ’ పారాయణం, ‘హనుమాన్ చాలీసా’ చదువుకోవడం.. నామ సంకీర్తనం చేయడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడు. ఆయురారోగ్యాలు, సిరి సంపదలను అనుగ్రహిస్తాడు.
అలాగే వెన్నతో అభిషేకం చేయించే వారికి సకల దోషాలు నివృత్తి అవుతాయి. అమావాస్య, శుక్ల, కృష్ణ పక్ష నవమి రోజుల్లో వెన్నతో అభిషేకం లేదా అలంకరణ చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.