త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పరమేశ్వరుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పరమేశ్వరుడి గురించి మనకు శివపురాణంలో ప్రతి విషయం చెప్పబడింది. శివ పురాణం ప్రకారం పూర్వజన్మలో కుబేరుడు ఒక దొంగగా ఉండేవాడు. పూర్వజన్మలో దొంగ అయిన కుబేరుడు తరువాత జన్మలో అధిక ధనికుడుగా మారాడు.
పూర్వజన్మలో అతని పేరు గొన్నిధి. ఒకానొక దశలో తినడానికి తిండి కూడా లేకపోవడంతో దొంగగా మారాడు. ఈ క్రమంలోనే ఒక శివాలయంలో అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించడంతో వాటిని దొంగతనం చేయాలని గొన్నిది భావిస్తాడు. ఆ సమయంలోనే ఆలయంలోకి ప్రవేశించగానే పెద్ద ఎత్తున గాలులు వీచడంతో ఆలయంలో ఉన్న దీపం ఆరిపోతుంది.
ఆలయంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం కోసం గొన్నిధి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే ఎంత వెలిగించినా దీపం వెలుగదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విసుగు చెందిన అతను తన చొక్కాతీసి మంటపెట్టి దాంతో దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యి గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మలో కుబేరుడిగా పుట్టి సంపదకు రక్షకుడిగా ఉంటాడు. ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు సంధ్యాసమయంలో శివుడి ముందు దీపం వెలిగించి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని.. శివపురాణం తెలియజేస్తోంది.